స్వాహా చేసిన రూ 1.50 కోట్లు రికవరీ చేయండి.. నల్గొండ కలెక్టరేట్ ఎదుట మహిళా సంఘాల నిరసన

స్వాహా చేసిన రూ 1.50 కోట్లు రికవరీ చేయండి.. నల్గొండ కలెక్టరేట్ ఎదుట  మహిళా సంఘాల నిరసన
  • నల్గొండ కలెక్టరేట్ ఎదుట  మహిళా సంఘాల నిరసన

నల్గొండ అర్బన్, వెలుగు :  నల్గొండ లోని 3వ వార్డు కేశరాజుపల్లిలోని  12 మహిళ సంఘాల సభ్యుల పేరు మీద నల్గొండలోని ఐసీఐసీఐ బ్యాంకులో రూ 1.50 కోట్లు స్వాహా చేసిన ఆర్పీ లింగంపల్లి వాహిని, ఐసీఐసీఐ బ్యాంక్ ఫీల్డ్ అసిస్టెంట్లు మహేశ్, కృష్ణల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘలా సభ్యులు డిమాండ్ చేశారు.  సోమవారం నల్గొండలోని కలెక్టరేట్ ఎదుట కేశరాజుపల్లి 12 మహిళా సంఘాల సభ్యులు ధర్నా చేసి ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  కేశరాజుపల్లిలో లింగంపల్లి వాహిని పది సంవత్సరాలు నుంచి మహిళా సంఘాలకు సంబంధించిన డ్వాక్రా రుణాలు ఇప్పిస్తోంది. 

ఈ క్రమంలో ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతాకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను తీసుకుని దగ్గర పెట్టుకొని 12 మహిళా సంఘాల సభ్యుల డాక్యుమెంట్లు సంతకాలను ఫోర్జరీ చేసి  నల్గొండలోని ఐసీఐసీఐ బ్యాంకులో ఫీల్డ్ అసిస్టెంట్ల సహకారంతో రూ1.50 కోట్లు స్వాహా చేసింది. ఈ విషయం  ఈ నెల 14వ తేదీన బ్యాంకుకు వెళ్లి మేనేజర్‌‌ను సంప్రదించగా బయటపడినట్లు మహిళా సంఘాల సభ్యులు పేర్కొన్నారు.

 ఇప్పటికే బ్యాంక్ ఫీల్డ్ అసిస్టెంట్లు కృష్ణ, మహేష్  జాబ్ కు రిజైన్ చేసి వెళ్లారని మిగతా విషయాలు విచారణ చేసి చెబుతామని బ్యాంక్ అధికారులు తెలిపారని సభ్యులు చెప్పారు.  కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నామని తమకు ఎలాంటి స్థిరాస్తులు చరాస్తులు లేవని స్వాహా చేసిన సొమ్మును రికవరీ చేసి మహిళా సంఘాల సభ్యులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఆయా మహిళా సంఘాల సభ్యులు సావిత్రమ్మ, ఎల్లమ్మ, అండాలు, కోటమ్మ, సరోజ, పూలమ్మ, సోమమ్మ, పాపమ్మ, రేణుక, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.