ప్రపంచంలోనే సేఫెస్ట్ సిటీగా అబుదాబి..దేశంలో హైదరాబాద్ సిటీకి ఆరో స్థానం

ప్రపంచంలోనే సేఫెస్ట్ సిటీగా అబుదాబి..దేశంలో హైదరాబాద్ సిటీకి ఆరో స్థానం
  • ఇండియాలో అత్యంత సురక్షిత నగరం అహ్మదాబాద్
  • నంబియో 2025 క్రైమ్ ఇండెక్స్ విడుదల  

అబుదాబి:ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన(సేఫెస్ట్) సిటీగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) రాజధాని అబుదాబి మొదటి స్థానంలో నిలిచింది. క్రౌడ్ సోర్స్​డ్ ఆన్‌‌‌‌లైన్ డేటాబేస్(నంబియో) 2025 క్రైమ్ ఇండెక్స్ ఈ మేరకు తాజా డేటా ఆధారంగా అబుదాబిని ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా ప్రకటించింది. 

అబుధాబి నగరం 2025 మిడ్- ఇయర్ సేఫ్టీ ఇండెక్స్ బై సిటీలో మొత్తం 279 నగరాలలో అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో ఖతార్ రాజధాని దోహా, మూడో స్థానంలో యూఏఈలోని దుబాయ్, నాలుగో స్థానంలో ఇదే దేశంలోని షార్జా, ఐదో స్థానంలో తైవాన్ లోని తైపీ నగరాలు ఉన్నాయి. అబుదాబి సేఫ్టీ ఇండెక్స్ స్కోరు మిడ్-ఇయర్‌‌‌‌లో 88.8గా ఉంది. ఇది 2025 ప్రారంభంలో (88.4) కంటే కొంచెం ఎక్కువ. ఈ రెండు జాబితాల్లోనూ అబుదాబి అగ్రస్థానంలో నిలిచింది. అంతేకాకుండా ఈ వార్షిక జాబితాలో అబుధాబి వరుసగా అగ్రస్థానంలో నిలవడం ఇది తొమ్మిదోసారి. 

దేశంలో అహ్మదాబాద్ ఫస్ట్.. హైదరాబాద్ కు ఆరో ప్లేస్ 

ఇండియా విషయానికి వస్తే గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ ను సేఫెస్ట్ సిటీగా ఈ ఇండెక్స్ పేర్కొంది. ఈ నగరానికి సేఫ్టీ ఇండెక్స్ స్కోరు 68.6 పాయింట్లు ఇచ్చింది. అహ్మదాబాద్ కు గ్లోబల్ ర్యాంకింగ్ లో 77వ స్థానం దక్కగా, మన దేశంలో మొదటి ప్లేస్ లో నిలిచింది. అలాగే,  హైదరాబాద్ 57.3 స్కోరుతో గ్లోబల్ ర్యాంకింగ్స్ లో 139వ స్థానం పొందగా.. మన దేశంలో 6వ స్థానం దక్కించుకుంది. 

ఇక మన దేశంలో సెకండ్ ప్లేస్ లో జైపూర్(65.2), మూడో స్థానంలో కోయంబత్తూర్ (62), నాలుగో స్థానంలో చెన్నై (60.03), ఐదో స్థానంలో పుణె (58.7), ఏడో స్థానంలో ముంబై (సేఫ్టీ ఇండెక్స్ స్కోరు 55.9) నిలిచాయి. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా కోల్​కతా(53.3), గురుగ్రామ్ (46.0), బెంగళూరు (45.7), నోయిడా(44.9), ఢిల్లీ (41.0) ఉన్నాయి.

 ఆయా నగరాల్లో జరిగే నేరాల ఆధారంగా ఈ రిపోర్టును సిద్ధం చేస్తారు. రాత్రి పూట, పగటి వేళ జరిగే నేరాలు, నిర్దిష్ట నేరాలు, విధ్వంసాలు, దొంగతనాలు, హత్యలను పరిగణనలోకి తీసుకొని ఈ రిపోర్టును సిద్ధం చేసినట్టు నంబియో ఇండెక్స్ వెల్లడించింది.