
- యాదాద్రిలో ముగిసిన రెవెన్యూ సదస్సులు
- పైలెట్ మండలంలో 712 అప్లికేషన్లు
- పీవోటీ అప్లికేషన్లు 584
- ఇందులో అసైన్డ్‌ల్యాండ్ 236, సాదాబైనామా 116
- ఇతర సమస్యలపై 232 అప్లికేషన్లు
యాదాద్రి, వెలుగు : భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహించిన సదస్సుల్లో పీవోటీ (ప్రొహిబిటెడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్) అప్లికేషన్లు ఎక్కువగా వచ్చాయి. వీటిలో అసైన్డ్ భూముల యాజమాన్య మార్పిడి, 2014 తర్వాత జరిగిన క్రయవిక్రయాలకు సంబంధించి సాదాబైనామా అప్లికేషన్లు ఉన్నాయి.
1,828 అప్లికేషన్ల పంపిణీ..
భూభారతి చట్టం అమలులో భాగంగా ఒక్కో జిల్లాలో ఒక్కో మండలాన్ని పైలెట్‌ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఇందులో భాగంగా యాదాద్రి జిల్లాలో ఆత్మకూరు(ఎం) మండలాన్ని పైలెట్‌గా ఎంపిక చేశారు. ఈ మండలంలోని 17 గ్రామాల్లో భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఇందులో భాగంగా 1,828 అప్లికేషన్లను ఆఫీసర్లు పంపిణీ చేశారు. ఈనెల 5 నుంచి 15 వరకు ప్రజల నుంచి 712 అప్లికేషన్లను స్వీకరించారు.
పీవోటీ అప్లికేషన్లే ఎక్కువ..
చట్టంలో పేర్కొనని వాటిని పరిష్కరించాలని కోరుతూ 584 పీవోటీ (ప్రొహిబిటెడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్) అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో అసైన్డ్‌ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం 236, 2014 జూన్ 2 తర్వాత జరిగిన భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన 116 సాదాబైనామాలకు సంబంధించినవి వచ్చాయి. ఇతర సమస్యలకు సంబంధించిన 232 అప్లికేషన్లు వచ్చాయి. ఇవే కాకుండా భూభారతి చట్టంలో పేర్కొన్న మాడ్యూల్స్‌కు సంబంధించిన మరో 128 అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో 120 అప్లికేషన్లను ఆన్లైన్ చేయడంతోపాటు 97 నోటీసులు జారీ చేశారు.
అసైన్డ్ ల్యాండ్మార్పిడికి..
ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన అసైన్డ్ ల్యాండ్కొనుగోలు చేసినవారిలో 236 మంది.. తమకు రిజిస్ట్రేషన్‌తోపాటు పట్టదారు పాస్ బుక్స్ ఇప్పించాలని అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఈ మండలలోని 136 సర్వే నంబర్లో 226 ఎకరాలను గతంలో అసైన్డ్ చేశారు. ఇందులో తాము 64 ఎకరాలను కొనుగోలు చేసినట్టు కొందరు, 358 సర్వే నంబర్లో 46 ఎకరాలను కొనుగోలు చేసినట్టు మరికొందరు అప్లికేషన్లు చేసుకున్నారు. మొత్తంగా ఈ రెండు సర్వే నంబర్లలో కలిపి 236 మంది 110 ఎకరాలను తమకు రిజిస్ట్రేషన్ చేయించాలని అప్లికేషన్చేసుకున్నారు. వీరిలో ఒక్కొక్కరు 5 గుంటల నుంచి ఎకరం వరకు కొనుగోలు చేశారు. రూల్స్ ప్రకారం హెచ్ఎండీఏ, మండల హెడ్క్వార్టర్సమీపంలో అసైన్డ్ల్యాండ్అమ్మడం, కొనడం నేరమని, ఈ భూమి బదలాయింపు జరగదని ఆఫీసర్లు చెబుతున్నారు. అప్లికేషన్లు చేసుకున్న వారికి ఫారం 1, 2 నోటీసులు జారీ చేస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు. ఆ తర్వాత అసైన్డ్చేసిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశాలున్నాయని స్పష్టం చేస్తున్నారు.
2014 తర్వాత సాదాబైనామాలకు..
సాదాబైనామాలకు సంబంధించి 116 అప్లికేషన్లు వచ్చాయి. అయితే ఇవన్నీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రయవిక్రయాలు జరిగాయి. రూల్స్ప్రకారం ఇవి చెల్లవు. కాబట్టి ప్రభుత్వం యాజమాన్య హక్కులు కల్పించదు. ఉమ్మడి రాష్ట్రంలో 2014 జూన్ 2 వరకు క్రయవిక్రయాల జరిగిన భూములకు రూల్ 6, సెక్షన్ 6 ప్రకారం యాజమాన్య హక్కులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఈ సాదాబైనామాలకు సంబంధించి గత ప్రభుత్వం 2020 అక్టోబర్12 నుంచి 2020 నవంబర్ 10 వరకు 15,994 అప్లికేషన్లు స్వీకరించింది. వీటిలో 8,741 తిరస్కరించి, 7,293 అప్లికేషన్లను ఓకే చేసింది. అయితే ధరణిలో సాదాబైనామాల పరిష్కారానికి ఆప్షన్ లేకపోవడంతో పెండింగ్ లోనే ఉన్నాయి.
జూన్2లోగా పరిష్కారం మండలంలో రెవెన్యూ సదస్సులు ముగిశాయి. సమస్యలపై వచ్చిన అప్లికేషన్లు పరిశీలించి ఆన్లైన్ చేస్తున్నాం. కొందరికీ నోటీసులు ఇచ్చాం. వివాదం లేని భూముల సమస్యలపై జూన్2 నాటికి పరిష్కారం చూపిస్తాం.
వీరారెడ్డి, అడిషనల్కలెక్టర్, యాదాద్రి
మరికొన్ని అప్లికేషన్లు ఇలా..
మిస్సింగ్ సర్వే నంబర్లు 11
పెండింగ్ మ్యుటేషన్ 04
సంతకం పెండింగ్ 08
విస్తీర్ణంలో తేడాలు 25
పేర్లలో తప్పులు 08
లావణి పట్టా 07
అసైన్డ్ ల్యాండ్పార్టిషన్ 02
ఫౌతి 22
ఇతర సమస్యలు 41