యాదాద్రి భువనగిరి జిల్లా దూదివెంకటాపురంలో కలెక్టర్ పల్లె నిద్ర..పలు సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం

యాదాద్రి భువనగిరి జిల్లా దూదివెంకటాపురంలో కలెక్టర్ పల్లె నిద్ర..పలు సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం
  •     పలు సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం

యాదాద్రి, వెలుగు: సీఎం రేవంత్​ ఆదేశాల మేరకు కలెక్టర్లు గ్రామాలబాట పడ్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం దూది వెంకటాపురం గ్రామంలో కలెక్టర్​ హనుమంతరావు బుధవారం రాత్రి పల్లె నిద్ర చేశారు. గురువారం ఉదయం మార్నింగ్ వాక్ లో భాగంగా ఆయా కాలనీల్లో తిరుగుతూ గ్రామస్తుల సమస్యలను తెలుసుకుంటూ అక్కడికక్కడే పరిష్కరించారు. గ్రామానికి ఆర్టీసీ బస్సు రావడం లేదని గ్రామస్తులు తెలుపగా, ఆర్టీసీ డీఎంకు ఫోన్ చేసి బస్సు రప్పించారు. కలెక్టర్ తో పాటు గ్రామస్తులు అందులో ప్రయాణించారు. గ్రామానికి  ప్రతిరోజూ రెండు సార్లు బస్సు వస్తుందని హామీ ఇచ్చారు. డ్రైనేజీ సరిగా లేకపోవడంతో వరద నీరు ఇండ్లల్లోకి వస్తుందని చెప్పగా,  డ్రైనేజీ పనులు చేపట్టాలని, సీసీ రోడ్లు వేసేందుకు ప్రపోజల్స్​ రెడీ చేయాలని ఆదేశించారు. వైకుంఠధామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని సూచించారు. 

అర్హులైన వారంతా రేషన్​కార్డులు, ఇతర సంక్షేమ పథకాల కోసం అప్లై చేసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు.  కోరుకొప్పుల వాణి విఘ్నేశ్వర దంపతులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా, భూమిపూజలో పాల్గొన్నారు. ఇటీవల తాటి చెట్టుపై నుంచి పడి మరణించిన గొడిసెల శ్రీ రాములు గౌడ్​ ఫ్యామిలీని పరామర్శించి, ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల ఎక్స్​గ్రేషియా వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అఫీసర్​కు సూచించారు. ప్రైమరీ స్కూల్ ను సందర్శించి, విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞలో పాల్గొన్నారు.  స్కూల్​ స్లాబ్ కు రిపేర్లు చేయించాలని పీఆర్​ ఏఈని ఆదేశించారు. జీపీ ఆవరణలో మొక్కలు నాటి, మెడికల్ క్యాంప్​ ప్రారంభించారు. రోడ్డు మధ్యలో ప్రమాదకరంగా ఉన్న కరెంట్ పోల్​ను తొలగించి, సిమెంట్​ పోల్  ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కలెక్టర్​ పర్యటనతో తమ సమస్యలన్నీ తీరుతున్నాయని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. అడిషనల్​ కలెక్టర్  భాస్కరరావు, డీఆర్డీవో నాగిరెడ్డి, జడ్పీ సీఈవో శోభారాణి ఉన్నారు.