గ్రేటర్ పరిధిలో కోటి వెహికల్స్​

గ్రేటర్ పరిధిలో కోటి వెహికల్స్​
  • ఆర్టీఏ ఆఫీసుల్లో రోజుకు 3 వేలకు పైగా రిజిస్ట్రేషన్లు 
  • సొంత వెహికల్​కే మొగ్గు చూపుతున్న నగర వాసులు
  • రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్లకు చేరువలో వెహికల్స్​
  • అదే స్థాయిలో పెరుగుతున్న పొల్యూషన్,​ ట్రాఫిక్

హైదరాబాద్, వెలుగు:  గ్రేటర్​హైదరాబాద్ పరిధిలో వెహికల్స్ సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ప్రతి ఒక్కరూ సొంత వెహికల్​ఉండాలని కోరుకుంటున్నారు. దీంతో ఏటా వాహనాల అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. ఆర్టీఏ ఆఫీసుల్లో జరుగుతున్న రిజిస్ట్రేషన్ల సంఖ్యనే ఇందుకు నిదర్శనం. వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లతో రవాణా శాఖకు మంచి ఆదాయం వస్తోంది. గతేడాది ఆర్టీఏకు దాదాపు రూ.8 వేల కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు చెప్పారు. ఈసారి మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే సిటీలు, టౌన్లలో ద్విచక్ర వాహనాల సంఖ్య భారీగా పెరిగినట్టు తెలిపారు. ద్విచక్ర వాహనాలతో పోలిస్తే కార్ల అమ్మకాలు కొంత తక్కువేనని పేర్కొన్నారు. మరోవైపు పెరిగిపోతున్న వెహికల్స్​తో ట్రాఫిక్​సమస్య తీవ్రమవుతోంది. రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి. పొల్యూషన్ రెట్టింపవుతోంది. ముఖ్యంగా సిటీలో ఉదయం, సాయంత్రం వేళల్లో రోడ్లపైకి వస్తున్న వెహికల్స్​తో గంటల తరబడి ట్రాఫిక్​నిలుస్తోంది.

అత్యధిక రిజిస్ట్రేషన్లు

రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే గ్రేటర్​హైదరాబాద్​పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే అత్యధిక రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో అన్ని రకాల వెహికల్స్​కలిపి దాదాపు 2 కోట్లు వరకు ఉండగా.. ఇందులో ద్విచక్ర వాహనాలే కోటి 50 లక్షల వరకు ఉన్నట్టు చెబుతున్నారు. వీటిలో కోటి వాహనాలు గ్రేటర్​పరిధిలోనే ఉన్నాయంటున్నారు. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా సిటీ పరిధిలోని ఐటీ కంపెనీలు, ప్రభుత్వ, ప్రైవేట్​సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. ప్రతిఒక్కరూ బైక్​ఉండాలని భావిస్తున్నారు. 

కాస్త డబ్బున్న ఉన్నవారు బైక్​తోపాటు కారు కూడా కొనేస్తున్నారు. దీంతో రోజూ వాహనాల రిజిస్ట్రేషన్లు, ట్రాన్స్​ఫర్, ఇన్సూరెన్స్​వంటి వాటికి ఆర్టీఏ కార్యాలయానికి వచ్చేవారి సంఖ్య భారీగానే ఉంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి రోజుకు 4 వేల నుంచి 5 వేల వరకు వాహనాల రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా, ఒక్క గ్రేటర్​పరిధిలోనే 3 వేల నుంచి 4 వేల వరకు వాహనాలు రిజిస్ట్రేషన్​అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. రెండేళ్ల కింద రోజుకు 1,500 నుంచి 2వేల వాహనాలు మాత్రమే రిజిస్ట్రేషన్​అయ్యేవని ఒక ఉన్నతాధికారి తెలిపారు. వాహనాల కంపెనీలు.. ఎప్పటికప్పుడు ప్రత్యేక ఫీచర్లతో మామూలు వెహికల్స్​తోపాటు ఎలక్ట్రికల్ వాహనాలను మార్కెట్​లోకి తీసుకురావడం కూడా వెహికల్స్ పెరగడానికి కారణంగా తెలుస్తోంది.