కిలో స్వీట్ల ధర రూ.20 కు తక్కువే

 కిలో స్వీట్ల ధర రూ.20 కు తక్కువే

జీవితంలో ఎప్పుడూ గడిచిపోయిన రోజులే బాగున్నాయి అనిపిస్తాయి. ఆ సమయంలో అది ఎలాంటి పరిస్థితి అయినా సరే.. అది ప్రస్తుతమున్న సందర్భం కన్నా తక్కువేనని చాలాసార్లు అనిపిస్తుంది. అది ఏ విషయంలోనైనా సరే. డబ్బు, వృత్తి, మనుషులు.. ఇలా ప్రతీ దాంట్లోనూ మార్పులు వస్తూంటాయి. రోజులతో పాటు మనుషులు, అలవాట్లు కూడా మారుతుంటాయి. అదే తరహాలో ధరలు కూడా. అప్పటి ధరలకు, ఇప్పటి ధరలకు విపరీతమైన వ్యత్యాసం ఉంటుంది. అదే విషయాన్ని గుర్తు చేస్తూ గాగ్రెట్ హల్చల్ అనే ఫేస్ బుక్ పేజీలో ఓ ఫొటో ప్రత్యక్షమైంది. ఈ ఫొటో లవ్లీ స్వీట్ హౌస్ పేరుతో ఉన్న ఓ షాపు.. మిఠాయిల మెనూను చూపిస్తోంది. ఇందులో మోతీచూర్ లడ్డూ , రసగుల్లా, గులాబ్ జామూన్, ఖీర్ మోహన్ లాంటి రకరకాల స్వీట్లూ కిలోకు దాదాపు రూ.10 నుంచి రూ.14 ఉండడం విశేషం. మరికొన్ని ప్రీమియం మిఠాయ్‌ల ధర రూ. 18 నుంచి రూ. కేజీకి 20.- కానీ అంతకంటే ఎక్కువ ఏవీ లేవు. 

ఇప్పుడైతే అందులో కొన్ని అదే ధరకు కనీసం ఒక్క పీస్ కూడా రాదు. ఇక సమోస, కచోరీ, పనీర్ పకోరా వంటి స్నాక్స్ కేవలం రూ.1 కంటే తక్కువగా ఉండడం గమనార్హం. అయితే ఈ ధరలన్నీ కూడా 1980కి చెందినవనిగా తెలుస్తోంది. కారణం 1980 సంవత్సరం - ఫేమస్ లవ్లీ స్వీట్ ప్రైస్ లిస్ట్ అని ఈ ఫొటో కింది భాగాన రాసుకొచ్చారు. కానీ దానిపై ఖచ్చితమైన సంవత్సరం ప్రస్తావన లేదు. ఈ పోస్ట్ పై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఆ రోజులు చాలా అద్భుతంగా ఉండేవని, ఆ షాపులోని స్వీట్లంటే ఇష్టమని.. నిజంగా మిస్ అవుతున్నామంటూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు. పంజాబ్‌లోని అత్యుత్తమ స్వీట్ షాపుల్లో ఇది కూడా ఒకటని, తాను 1996-2000లో జలంధర్‌లో ఉన్న సమయంలో అక్కడకు క్రమం తప్పకుండా వెళ్లేవాడినని మరో యూజర్ రిప్లై ఇచ్చారు.