రోజుకు లక్ష టెస్టులు

రోజుకు లక్ష టెస్టులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మరోవైపు టెస్టులు ఎక్కువగా చేయడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు కరోనా టెస్టుల సంఖ్యను పెంచాలని కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. మే చివరి నాటికి రోజుకు లక్ష టెస్టులు చేయాలని భావిస్తోంది. ప్రతిరోజూ లక్ష ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టులు, మరో లక్ష ఆర్టీ పీసీఆర్ టెస్టులు చేయాలని యోచిస్తోంది. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇక మూడో ఫేజ్ లాక్ డౌన్ లో కొన్ని సడలింపులు ఇవ్వడంతో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న ప్రభుత్వం… అందుకు తగ్గట్లుగా ప్రిపేర్ కావాలని నిర్ణయించింది.

ఇప్పటి వరకు దేశంలో కరోనాను నిర్ధారించే ఆర్టీ పీసీఆర్ టెస్టులు 10.46 లక్షలు చేశారు. ప్రస్తుతం రోజుకు సగటున 75వేల ఆర్టీ పీసీఆర్ టెస్టులు చేస్తున్నారు. ఇక ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టులకు ప్లాన్ చేసినా, చైనా నుంచి తెప్పించిన రెండు కంపెనీల కిట్లు సరిగా పని చేయకపోవడంతో తిరిగి పంపించారు. ఈ నేపథ్యంలో కిట్ల కోసం కేంద్రం కొత్తగా కొన్ని కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చింది. వీటితో రెడ్ జోన్లలో ఎక్కువగా పరీక్షలు చేయాలని భావిస్తోంది.

మొత్తం 23 లక్షల కిట్లు…

‘‘కరోనా అనుమానితులను గుర్తించేందుకు ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టులను చేయాలని నిర్ణయించాం. 8 నుంచి 9 స్వదేశీ కంపెనీల కిట్లను పరిశీలించాం. వీటిలో రెండు కంపెనీలకు ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చాం. మరో సౌత్ కొరియన్ కంపెనీ కూడా కిట్లను ఇండియాలోనే తయారు చేస్తోంది. వివిధ మార్గాల ద్వారా యాంటీబాడీ కిట్లను కొనుగోలు చేస్తున్నాం” అని సీనియర్ ఆఫీసర్ ఒకరు చెప్పారు. స్వదేశీ, విదేశీ కంపెనీల నుంచి కలిపి మొత్తం 10 లక్షల ఆర్టీ పీసీఆర్ కిట్లు వస్తాయని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. అదే విధంగా లోకల్ కంపెనీల నుంచి 10 లక్షల ర్యాపిడ్ యాంటీబాడీ కిట్లు వస్తాయని భావిస్తోంది. వీటికి అదనంగా సౌత్ కొరియన్ కంపెనీ మరో 3లక్షల యాంటీబాడీ కిట్లను వారంలోగా అందజేసే అవకాశం ఉంది. ‘‘మే 31 వరకు రోజుకు లక్ష ఆర్టీ పీసీఆర్, మరో లక్ష ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టులు చేయాలని భావిస్తున్నాం. ఆ తర్వాత 4 నుంచి 6 వారాల్లో టెస్టుల సంఖ్యను 5లక్షల పెంచాలని యోచిస్తున్నాం. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నాం” అని మరో సీనియర్ ఆఫీసర్ తెలిపారు.

selective focus of scientist holding sample with coronavirus test lettering near test tubes isolated on white