
గుజరాత్ లో 156 సీట్లను గెలుచుకొని అధికార బీజేపీ ఏడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రెండోసారి సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటుగా 16 మంది ఎమ్మెల్యేలు.. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ 16 మందితో కూడిన కొత్త కేబినెట్‌లో ఒకే ఒక మహిళా ఎమ్మెల్యేకు చోటు దక్కింది. ఆమెనే భానుబెన్ బాబరియా.
భానుబెన్ బాబరియా రాజ్‌కోట్ రూరల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. భానుబెన్ బాబరియా..ఈ నియోజకవర్గం నుంచి గెలవడం ఇది మూడోసారి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భానుబెన్ బాబరియా ఆప్ ప్రత్యర్థిపై 48,494 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. 2007, 2012లోనూ ఇదే నియోజకవర్గం నుంచి గెలిచిన ఆమెకు 2017లో మాత్రం అవకాశం దక్కలేదు. దీంతో రాజ్‍కోట్ మున్సిపల్ కార్పొరేషన్‍లో ప్రస్తుతం కౌన్సిలర్ గా ఉన్నారు. ప్రస్తుతం మళ్లీ ఆమె ఎమ్మెల్యేగా గెలవడంతో మంత్రిగా అవకాశం దక్కింది. సామాజిక న్యాయం, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా భానుబెన్ బాబరియాకు పోర్ట్‌ఫోలియోను కేటాయించారు.