
దేశ చరిత్రలోనే చారిత్రాత్మక ఘట్టం తమిళనాడులో జరిగింది. రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం లేకుండానే ఏకంగా పది బిల్లులు చట్టాలుగా మార్పు చెందాయి. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను 2020 నుంచి ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవి పెండింగ్ లో పెడుతూ వస్తుండటం తెలిసిన విషయమే. చివరికి సుప్రీం కోర్టు తీర్పుతో పది బిల్లులను చట్టాలుగా మార్చుతూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది తమిళ ప్రభుత్వం.
రాష్ట్ర శాసన సభ తీర్మానించి పంపిన బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ తనవద్దే పెట్టుకోవడం చట్ట విరుద్ధం అని గత వారం సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ ఎస్.బి.పార్దివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్ లతో కూడిన ధర్మాసనం గవర్నర్ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘శాసనసభ పంపిన బిల్లులను ఆమోదించకుండా రాష్ట్రపతి సిఫారసు కోసం ఉంచడం చట్ట విరుద్ధం. గవర్నర్ ఆమోదించకుండా పెట్టిన బిల్లులు క్లియర్ అయినట్లుగా పరిగణించవచ్చు. అసెంబ్లీ రెండో సారి తీర్మానం చేసి పంపిన నాటి నుంచే చట్టాలుగా నోటిఫై చేయవచ్చు’’నని ఆదేశించింది. ఈ తీర్పుతో పెండింగ్ లో ఉన్న ఈ బిల్లులను చట్టాలుగా నోటిఫై చేసే సదుపాయం కల్పించింది సుప్రీం కోర్టు.
సుప్రీం ఆదేశాల మేరకు ఈ పది బిల్లులను 2023, నవంబర్ 18 నుంచి అధికారింగా చట్టాలుగా మారినట్లు అయ్యింది. ఈ పది బిల్లులలో కీలకమైనది యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ (వీసీ) నియామకానికి సంబంధించినది. దీనిపై సీనియర్ అడ్వకేట్, డీఎంకే రాజ్యసభ ఎంపీ పి.విల్సన్ స్పందిస్తూ.. పది బిల్లులు చట్టాలుగా అమలులోకి వస్తున్నాయని అన్నారు. అలాగే ప్రభుత్వం నామినేట్ చేసిన వ్యక్తి స్టేట్ యూనివర్సిటీలకు ఛాన్స్లర్ గా ఉంటారని, గవర్నర్ రవి తొలగించబడతారని అన్నారు. అదే విధంగా ఇకనుంచి వైస్ ఛాన్స్లర్ ల నియామకంలోనూ గవర్నర్ జోక్యం తగ్గుతుందని అన్నారు.
#BREAKING | ஆளுநருக்கு எதிரான வழக்கில் உச்ச நீதிமன்றம் அளித்த தீர்ப்பு வெளியானதை அடுத்து, தமிழ்நாடு அரசிதழில் 10 மசோதாக்களும் சட்டமானதாக அறிவிப்பு
— Sun News (@sunnewstamil) April 12, 2025
10 மசோதாக்களையும் ஆளுநர், குடியரசுத் தலைவருக்கு அனுப்பியது சட்ட விரோதம் என உச்ச நீதிமன்றம் தீர்ப்பு வழங்கியதுடன், அம்மசோதாக்களுக்கு… pic.twitter.com/4FFd1YnqkJ
సుప్రీం కోర్టు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలతో పది బిల్లులను చట్టాలుగా నోటిఫై చేస్తూ గెజిట్ విడుదల చేసింది తమిళనాడు డీఎంకే ప్రభుత్వం. ఈ సందర్భంగా ‘‘సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకం’’ అని సీఎం స్టాలిన్ అన్నారు. అసెంబ్లీ పంపిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా పంపడంతో.. మరోసారి అసెంబ్లీ తీర్మానం చేసి పంపినా కూడా ఆమోదించకపోవడం దారుణమని అన్నారు. ఇది అన్ని రాష్ట్రాల విజయంగా ఆయన అభివర్ణించారు.
తమిళనాడులో బిల్లుల విషయంలో పెద్ద రాజకీయ యుద్ధమే నడిచింది. అసెంబ్లీ తీర్మానం చేసి పంపిన బిల్లులను రెండు సార్లు వెనక్కి పంపారు గవర్నర్ రవి. దీంతో మరోసారి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపగా వాటిని ఆమోదించకుండా తన వద్దే ఉంచుకుని ఆ తర్వాత రాష్ట్రపతికి సిఫారసు చేశారు. దీనిపై తమిళనాడు ప్రభుత్వం ఫిబ్రవరిలో సుప్రీంకోర్టుకు వెళ్లగా.. బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి మూడేండ్లు ఎందుకు పట్టిందని సుప్రీం కోర్టు ఆగ్రహం వక్తం చేసింది. ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ ఇద్దరూ తేల్చుకోవాలని, లేదంటే తామే నిర్ణయం తీసుకుంటామని చెప్పింది.
ఈ బిల్లులపై 2023లో సుప్రీంను ఆశ్రయించింది డీఎంకే ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వం నియమించిన గవర్నర్ రవి.. ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వ విధానాలకు అడ్డుపడుతున్నారని, బిల్లులను ఆమోదించకుండా కాలయాపన చేస్తున్నారని డీఎంకే ప్రభుత్వం ఆరోపించింది.
దీనిపై ఈ వారం వాదనలలో భాగంగా సుప్రీం కోర్టు గవర్నర్ కు ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్ కు మూడు ఆప్షన్స్ ఇచ్చింది. పంపిన బిల్లులను క్లియర్ చేయడం, ఆమోదించకపోవడం, లేదా రాష్ట్రపతికి పంపడం. అదే విధంగా ఈ మూడు ఆప్షన్లను అమలు చేసేందుకు గవర్నర్ కు నెల రోజుల గడువు మాత్రమే ఉంటుందని టైమ్ లైన్ కూడా విధించింది. ఈ గడువు లోపు నిర్ణయం తీసుకోకపోతే న్యాయపరమైన విచారణ ఉంటుందని సూచించింది. ఈ నిర్ణయంతో గవర్నర్ అధికారాలు తగ్గించినట్లు కాదని, గవర్నర్ పార్లమెంటరీ ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సూచించింది.