‘నానక్‌రాంగూడ లోధాబస్తీకి చెందిన కలాపతి గౌతమ్ సింగ్(21) కుటుంబం కిరాణ షాప్‌ను నిర్వహిస్తోంది. దూల్ పేట నుంచి కిలో గంజాయిని రూ.8 వేలకు కొని.. తమ షాపుతో పాటు నానక్ రాంగూడలోని కన్ స్ట్రక్షన్స్ వర్కర్లకు, లంగర్ హౌస్, గోల్కొండ పరిసర ప్రాంతాల్లోని బస్తీల్లో కలాపతి కుటుంబసభ్యులు అమ్మేవారు. టీఎన్ న్యాబ్ పోలీసులు మంగళవారం దాడులు చేసి కలాపతి గౌతమ్ సింగ్‌తో పాటు అతడి కుటుంబసభ్యులు నీతూబాయి, మధుబాయి, మైనర్‌ను అరెస్ట్ చేశారు. రూ.40 లక్షల విలువైన 23 కిలోల గంజాయిని, కారు, 2 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు చెందిన 16 అకౌంట్లను గుర్తించి అందులోని రూ. కోటి 53 లక్షలను ఫ్రీజ్ చేశారు. కలాపతి కుటంబానికి చెందిన గచ్చిబౌలి రాజీవ్‌నగర్ ,లంగర్ హౌస్ పరిధి గాంంధీనగర్‌లో రెండు ఇండ్లను గుర్తించారు. ఈ గంజాయి దందాలో మొత్తం రూ.4 కోట్లు విలువ చేసే ప్రాపర్టీస్‌ను వీళ్లు సంపాందించినట్లు ఆధారాలు సేకరించి వాటిని టీ న్యాబ్ పోలీసులు సీజ్ చేశారు.’
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ సిటీలో గంజాయి గుప్పుమంటున్నది. బస్తీలు, ఇండస్ట్రియల్ ఏరియాలు, టూరిస్ట్ స్పాట్స్, పార్కులు, నిర్మానుష్య ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయి. రూ.వందకు 10 గ్రాముల గంజాయిని అమ్ముతున్న గాంజా మాఫియా యువతను మత్తుకు బానిసను చేస్తోంది. దీంతో గంజాయి మత్తులో కొందరు అరాచకాలకు పాల్పడుతున్నారు. సిటీలో గంజాయితో పాటు హాష్ ఆయిల్‌కు డిమాండ్ పెరిగిపోయింది. పోలీసులు, ఎక్సైజ్ అధికారుల కళ్ళు గప్పి గంజాయి మాఫియా రెచ్చిపోతున్నది. స్లమ్ ఏరియాల్లోని అడ్డా కూలీలు,ఆటో డైవర్లు,రిక్షా కార్మికులు, శివారు ప్రాంతాల్లోని ఇండస్ట్రియల్ ఏరియాల్లో పనిచేసే కార్మికులకు గంజాయి, హాష్ ఆయిల్ సప్లయ్ చేస్తున్నది. వైజాగ్ ఏజెన్సీ ఏరియాల నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర, బెంగళూర్‌కు తరలిస్తూనే సిటీలోని పెడ్లర్ల ద్వార కస్టమర్లకు అందిస్తున్నారు. గంజాయి సిగరెట్లు, హాష్ ఆయిల్ బాటిల్స్‌ను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.
హైదరాబాద్ మీదుగా 20 టన్నులు ట్రాన్స్‌పోర్టు
రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి అమ్మకాలు పెరిగిపోయినట్లు పోలీసులు గుర్తించారు. జిల్లాలు, గ్రామాల్లోను గంజాయి రిటెయిల్ సేల్స్ జరుగుతున్నట్లు స్టేట్ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో(టీ న్యాబ్)కు సమాచారం అందింది. ప్రధానంగా ఆదిలాబాద్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో అమ్మకాలు, సిటీకి సప్లయ్ జరుగుతునట్లు టీ న్యాబ్ గుర్తించింది. మహబూబాబాద్ జిల్లాకు చెందిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్స్ సహకారంతో గంజాయి సప్లయ్ చేస్తున్న గ్యాంగ్‌ను ఈ నెల17న టీ న్యాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయి బిజినెస్‌లో రూ. 5 కోట్లు సంపాదించారని గుర్తించారు. ఈ గ్యాంగ్ ద్వారా స్థానికంగా మరో 20 మంది గంజాయి సప్లయర్లుగా మారినట్లు ఆధారాలు సేకరించారు. ఇలా ప్రతి ఏటా దాదాపు 20 టన్నులకుపైగా గంజాయిని సిటీ మీదుగా ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నారు.ఇందులో 2 టన్నుల వరకు గ్రేటర్ లోని మూడు కమిషనరేట్ల పరిధిలో అమ్మకాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
గంజాయి మత్తులో యువత
యువత గంజాయిని సిగరెట్లలో పెట్టుకుని స్మోక్ చేస్తున్నారు. హాష్ ఆయిల్‌ను తినే పదార్ధాలలో కలుపుకుని తీసుకుంటున్నారు. గతంలోనూ సిటీలో డ్రగ్స్ అమ్మకాలు ఎక్కువగా జరిగేవి. నార్కొటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్,టాస్క్‌ఫోర్స్ పోలీసుల ఆపరేషన్స్‌తో డ్రగ్స్ సప్లయ్ తగ్గింది. దీంతో గంజాయికి భారీగా డిమాండ్ పెరిగిపోయింది. హోల్‌సేల్‌గా కొనుగోలు చేసి బస్తీల్లో అమ్ముతున్నారు. ఇందులో ఎక్కువగా శివారు ప్రాంతాల్లోని లేబర్ కాలనీలు,రాజీవ్ గృహకల్ప,సైదాబాద్‌లోని సింగరేణి కాలనీ, మీర్ పేట, నందనవనం, వనస్థలిపురం, సరూర్ నగర్, దూల్‌పేట,జీడిమెట్ల,చింతల్,సూరారం కాలనీ,దుండిగల్ సహా ఇండస్ట్రియల్ ప్రాంతాల్లో గంజాయి వాడకం పెరిగినట్లు టీ న్యాబ్ గుర్తించింది. గోల్కొండ, లక్ష్మీనగర్, ఎల్‌బీనగర్, హాస్టల్స్ ఎక్కువగా ఉన్న అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్, నాంపల్లి, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లు, ఎంజీబీఎస్, జేబీఎస్ తో పాటు నెక్లెస్‌రోడ్, పార్కులున్న ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నట్లు ఆధారాలు సేకరించింది.
మరో కుటీర పరిశ్రమగా గంజాయి ప్యాకింగ్
రాష్ట్రంలో గుడుంబా అమ్మకాలు నిషేధించడంతో ఆ వ్యాపారం చేసిన వాళ్లే ఇప్పుడు గంజాయి దందా మొదలుపెట్టారు. పోలీసులకు పట్టుబడుతున్న వారిలో వీరి సంఖ్య ఎక్కువగా ఉంటున్నది. ఎన్నిసార్లు పట్టుబడినా గంజాయి దందాను మాత్రం వీడడం లేదు. వైజాగ్,ఒడిశా ఏజెన్సీల నుంచి గంజాయిని దళారుల వద్ద తక్కువ రేటుకు గంజాయిని కొని దూల్‌పేట, మంగళ్‌హాట్, ఫలక్‌నుమా, ఉప్పుగూడ, పురానాపూల్, జియాగూడ సహా స్లమ్ ఏరియాల్లో చిన్నచిన్న కవర్లలో ప్యాక్ చేస్తున్నారు. కేవలం రూ.100కు 10గ్రాముల గంజాయి అమ్ముతున్నారు. వీటిని గ్రేటర్‌లోని అన్ని ప్రాంతాల్లోని రెగ్యులర్ కస్టమర్లుకు చైన్ సిస్టమ్‌తో సప్లయ్ చేస్తున్నారు. ఫుట్‌పాత్‌లు, రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్ల వద్ద షెల్టర్ తీసుకునే వారికి అమ్ముతున్నారు. హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాలు, సిటీలోని పార్కులకు సమీపంలోను గంజాయి నెట్‌వర్క్ ను ఏర్పాటు చేసుకున్నారు.
మీర్‌పేట పరిధి నందనవనంలో గంజాయి మత్తులో 8 మంది యువకులు ఓ బాలిక ఇంట్లోకి వెళ్లారు. కుటుంబసభ్యులను కత్తులతో బెదిరించి దాడి చేశారు. బాలిక మెడపై కత్తిపెట్టి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిపై గ్యాంగ్ రేప్, పోక్సో కేసు ఫైల్ చేశారు. గంజాయి మత్తులోనే నిందితులు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మీర్‌పేట, నందనవనం ఏరియాల్లో గంజాయికి బానిసైన కొందరు కొంతకాలంగా అరాచకాలకు పాల్పడుతున్నారని.. చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు ఆందోళనలు చేస్తున్నారు.’
‘గతేడాది ఎల్‌బీనగర్ పరిధి పిండి పుల్లారెడ్డి గార్డెన్ సమీపంలో నర్సింహారెడ్డి అనే యువకుడితో గొడవపడ్డ గంజాయి గ్యాంగ్.. అతడిని విచక్షణా రహితంగా పొడిచి హత్య చేసింది. ఈ కేసులో ఎల్‌బీనగర్ పోలీసులు 18 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎల్‌బీనగర్, వనస్థలిపురం, సరూర్ నగర్ ఏరియాల్లో గంజాయి అమ్మకాలు ఎక్కువగా ఉండగా.. మత్తుకు బానిసై వారు స్థానికులతో గొడవలు పెట్టుకోవడం, దాడులు, దారి దోపిడీలకు పాల్పడటం చేస్తున్నారు.
గంజాయి బానిసలను గుర్తిస్తం
గంజాయి పెడ్లర్లపై నిఘా కొనసాగుతోంది. మీర్‌పేట పరిధి నందనవనంతో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో గంజాయి దందా జరుగుతున్నట్టు గుర్తించాం. బస్తీలు,శివారు ప్రాంతాల్లో రూ.100 పెడితే గంజాయి దొరుకుతున్నట్లు ఆధారాలు సేకరించాం. పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ సిబ్బందితో గస్తీ ముమ్మరం చేశాం. ఇప్పటి వరకు గంజాయి సప్లయర్లపైనే ఫోకస్ పెట్టాము. ఇక నుంచి కస్టమర్ల చెయిన్‌ను ట్రేస్ చేస్తం. వారి ద్వారా పెడ్లర్స్‌ను గుర్తించి అరెస్ట్ చేస్తం.
- డీఎస్ చౌహాన్, సీపీ, రాచకొండ కమిషనరేట్