మానేరు నదిలో చిక్కుకున్న కూలీలు..కాపాడిన గ్రామస్తులు

మానేరు నదిలో చిక్కుకున్న కూలీలు..కాపాడిన గ్రామస్తులు
  • పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్​ మండలం గట్టేపల్లిలో ఘటన 

సుల్తానాబాద్, వెలుగు: ఇసుక తోడేందుకు ట్రాక్టర్లతో వెళ్లిన 10 మంది కూలీలు మానేరు నదిలో చిక్కుకున్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్  మండలం గట్టేపల్లి సమీపంలోని మానేరు వాగులో చిక్కుకుపోగా, గ్రామస్తులు వారిని కాపాడారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఐదు ట్రాక్టర్లతో పాటు ట్రాక్టర్​ ఓనర్లు, కూలీలు ఇసుక కోసం మానేరు ఒడ్డుకు వెళ్లారు. 

ఇసుకను ట్రాక్టర్లలోకి నింపుతుండగా, వాగులో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. అక్కడి నుంచి బయటపడే అవకాశం లేకుండా పోయింది. రెండు ట్రాక్టర్లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. దీంతో నదిలో చిక్కుకుపోయిన వారు ఆర్తనాదాలు చేశారు. గ్రామస్తులు గమనించి వారిని తాళ్ల సాయంతో అతి కష్టం మీద కాపాడారు. నదిలో చిక్కుకున్న 10 మందిలో ఓ మహిళ కూడా ఉంది. సోమవారం రాత్రి లోయర్  మానేరు డ్యాం గేట్లు ఎత్తడంతో వరద ఉధృతి పెరిగింది. దీంతో అధికారులు ప్రమాదపు హెచ్చరికలు జారీ చేశారు. సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై శ్రావణ్ కుమార్  ఘటనా స్థలానికి చేరుకొని, పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.