ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం దాకా 10.42 లక్షల మందికి వైరస్

ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం దాకా 10.42 లక్షల మందికి వైరస్
  • నాలుగు రోజుల్లోనే డబులైన కరోనా బాధితులు 
  • ఇప్పటిదాకా 5.5 కోట్ల కేసులు 
  • 8.26 లక్షలకు పైగా మరణాలు

వాషింగ్టన్: కరోనా పీడ వదలడం లేదు. రూపాలు మార్చుకుని ప్రపంచాన్ని కమ్మేస్తోంది. వైరస్ దెబ్బకు అగ్రదేశం అమెరికా చిగురుటాకులా వణికిపోతోంది. ప్రపంచంలోనే మరెక్కడా లేనంతగా అక్కడ డైలీ కేసులు నమోదవుతున్నాయి. అమెరికాలో ఒక్క రోజే 10 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం 7.30 దాకా 10.42 లక్షల మందికి వైరస్ సోకినట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ డేటా వెల్లడించింది. గత వారం రోజుల్లో ప్రతి 100 మందిలో ఒకరికి వైరస్ సోకిందని తెలిపింది. పరిస్థితి చేయి దాటి పోతుండటంతో వైరస్ కట్టడిపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు వైట్​హౌస్ కరోనా రెస్పాన్స్ టీమ్‌‌తో ప్రెసిడెంట్ జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ మంగళవారం (అక్కడి టైం ప్రకారం) భేటీ కానున్నారని యూఎస్ఏ టుడే తెలిపింది.

4 రోజుల్లో కేసులు డబుల్
అమెరికాలో గత గురువారం నమోదైన 5.91 లక్ష కేసులే ఇప్పటిదాకా ఉన్న సింగిల్ డే రికార్డు. కానీ నాలుగు రోజుల్లోనే కరోనా కేసులు దాదాపు డబుల్ అయ్యాయి. సోమవారం దాకా గత వారంలో రోజూ సగటున 4.5 లక్షల కేసులు నమోదయ్యాయి. అంతకుముందు వారంలో 17.6 లక్షల కేసులు వచ్చాయి. ఇక అమెరికాలో 5.5 కోట్ల కరోనా కేసులు నమోదైనట్లు జాన్స్‌‌ హాప్కిన్స్ వర్సిటీ లెక్కలు చెబుతున్నాయి. అంటే ప్రతి ఆరుగురిలో ఒకరు వైరస్ బారిన పడ్డారు. అమెరికాలో ఇప్పటి వరకు 8.26 లక్షల మందికి పైగా కరోనా వల్ల చనిపోయారు.