తెలంగాణలో మరో 10 మందికి కరోనా

తెలంగాణలో  మరో 10 మందికి కరోనా

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో  కొత్తగా  మరో పది కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ సోమవారం  ప్రకటించింది. ఇందులో 9 హైదరాబాద్‌‌లో,  మరో కేసు కరీంనగర్ జిల్లాలో నమోదైనట్లు తెలిపింది. గడిచిన 24 గంటల్లో  రాష్ట్రవ్యాప్తంగా 989 మందికి టెస్టులు నిర్వహించగా..పది మందికి పాజిటివ్ వచ్చిందని పేర్కొంది. కొత్త కేసులతో  రాష్ట్రంలో కరోనా బాధితుల మొత్తం సంఖ్య 55 కి చేరింది. రాష్ట్రంలో ఇద్దరికి కరోనా కొత్త వేరియంట్ (జేఎన్‌‌.1) సోకినట్లు జరిగిన ప్రచారాన్ని హెల్త్ డైరెక్టర్‌‌‌‌ రవీంద్ర నాయక్ ఖండించారు. జీనోమ్ సీక్వెన్సింగ్ ఫలితాలు ఇంకా రాలేదని, తప్పుడు ప్రచారం చేయొద్దని మీడియాకు సూచించారు. 

 కరోనా సోకిన ఇద్దరు పిల్లలు నీలోఫర్‌‌‌‌లో ట్రీట్మెంట్ పొందుతున్నారని..వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉషారాణి తెలిపారు. న్యూమోనియా వచ్చిన పిల్లల్లో ఉండే లక్షణాలే కరోనా సోకిన పిల్లల్లోనూ ఉన్నాయని ఆమె చెప్పారు. ఆదివారం చనిపోయిన 2 నెలల బాబుకు కరోనా లేదని వెల్లడించారు. పుట్టుకతోనే ఆ చిన్నారికి హార్ట్‌‌లో హోల్‌‌ ఉందని..బ్లడ్ ఇన్ఫెక్షన్‌‌ కూడా అయిందని వివరించారు.