దేశంలో 84 మందికి కరోనా: వారిలో 10 మంది కోలుకుని డిశ్చార్జ్

దేశంలో 84 మందికి కరోనా: వారిలో 10 మంది కోలుకుని డిశ్చార్జ్

దేశంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసులు 84కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి సంజీవ కుమార్ తెలిపారు. వారిలో ఇప్పటికే 10 మంది చికిత్స తర్వాత పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు చెప్పారు. దేశంలో కరోనా పరిస్థితిపై శనివారం మధ్యాహ్నం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి నియంత్రణకు కేంద్ర అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. విదేశాల నుంచి వచ్చే వారిని స్క్రీనింగ్ చేస్తున్నామని, లక్షణాలు ఉంటే ఆస్పత్రికి తరలిస్తున్నామని వివరించారు సంజీవ కుమార్. అయితే లక్షణాలు లేకున్నా కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారు ఇంటిలోనే సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు.

ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 84 కరోనా కేసులు నమోదు కాగా.. వారిలో చికిత్స తర్వాత 10 మంది కోలుకుని డిశ్చార్జ్ కూడా అయ్యారని తెలిపారు సంజీవ కుమార్. అయితే పేషెంట్లతో కాంటాక్ట్ అయిన దాదాపు నాలుగు వేల మంది కరోనా అనుమానితులను సర్వైలెన్స్‌లో ఉంచామని చెప్పారాయన. ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులను ప్రత్యేక విమానంలో శనివారం అర్ధరాత్రి సమయానికి ముంబై చేరుస్తామని, వారిని ప్రత్యేక క్వారంటైన్ సెంటర్‌లో పెట్టి పరీక్షిస్తామని తెలిపారు. అలాగే ఇటలీలో నిలిచిపోయిన భారత విద్యార్థులను ఇవాళ ఓ ఫ్లైట్ వెళ్తున్నట్లు పేర్కొన్నారు.