చిన్న చిన్న ఎక్సర్ సైజులు.. 15 నిమిషాలు చేస్తే చాలు.. బాడీకి ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది..!

చిన్న చిన్న ఎక్సర్ సైజులు.. 15 నిమిషాలు చేస్తే చాలు.. బాడీకి ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది..!

రోజూ వారి జీవితంలో మరింత యాక్టివ్ గా ఉండేందుకు, మనస్సును ఉత్తేజపరిచేందుకు కొన్ని వ్యాయామాలు తప్పనిసరంటున్నారు ఆరోగ్య నిపుణులు. మార్నింగ్ రొటీన్ లో భాగంగా కొన్ని స్ట్రెచ్ లను చేర్చుకోవడం వల్ల రోజులో ఎలాంటి మార్పులు వస్తాయన్నది మీరే గమనించవచ్చని అంటున్నారు.

శరీరాన్ని సాగదీసినప్పుడు, కండరాలు ఉత్తేజితమై ఒత్తిడి తగ్గుతుంది. ఇది రక్త ప్రవాహాన్ని సైతం పెంచుతుంది. కండరాల దృఢత్వాన్ని నిరోధించడంలో ఇది సహాయపడుతుంది. సున్నితంగా చేసే ఈ ప్రక్రియలో పూర్తిగా శరీరాన్ని సాగదీయడం లేదా మెడ, భుజాలు లేదా కాళ్లు వంటి నిర్దిష్ట ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఉదయాన్నే చేయడం వల్ల కలిగే అనుభూతి, ప్రయోజనాలను ఆస్వాదించండి. అందులో ముఖ్యంగా ఈ 10 సూపర్ సింపుల్ స్ట్రెచ్‌లను ఒకసారి ట్రై చేసి చూడండి.

నెక్ రోల్స్ : మీ మెడలో ఒత్తిడిని వదిలించుకోవడానికి తలను ఒక వైపు నుండి ప్రారంభించి, మరొక వైపుకు నెమ్మదిగా వృత్తాకారంగా తిప్పండి.

ఆర్మ్ సర్కిల్‌లు : మీ భుజం కీళ్లను వేడెక్కేలా చేయడానికి చేతులను ప్రక్కలకు చాచి, చేతులతో పెద్ద వృత్తాకార మార్గంలో తిప్పండి. అలా ముందుకు ఆపై వెనుకకు వెళ్లండి.

బొటనవేలను తాకే ప్రక్రియ : మీ పాదాలను పైకి చాచి, మెడను కాస్త వంపి.. కాళ్ళ వెనుక భాగంలో సాగినట్లుగా భావించి, మీ చేతివేళ్లతో కాలి వేళ్లను తాకడానికి ప్రయత్నించండి.

లెగ్ స్వింగ్స్ : ఈ ప్రక్రియ చేయాలంటే ముందుగా స్ట్రైట్ గా నిలబడి, ఒక కాలును ముందుకు వెనుకకు స్వింగ్ చేయండి. అలా మరో కాలుతో ట్రై చేయండి.

సైడ్ బెండ్స్: మీ పాదాలను వెడల్పుగా చాచి.. ఒక చేతిని పైకి లేపి, మెల్లగా పక్కకు వంగి, శరీరానికి ఎదురుగా సాగదీయండి. అలా మరొక వైపు పునరావృతం చేయండి.

తుంటి వలయాలు : మీ తుంటిపై చేతులు పెట్టి నిటారుగా నిలబడడండి. ఆ తర్వాత నడుమును సవ్య దిశలో, అపసవ్య దిశలో కదిలిస్తూ, తుంటితో వృత్తాకారంగా తిప్పండి.

కాఫ్ స్ట్రెచ్ : గోడను సపోర్ట్ గా చేసుకుని నిలబడండి. మీ రెండు చేతులను గోడపై ఉంచి.. మడమను నేలపై ఉంచుతూ ఒక అడుగు వెనక్కి వేసి నిలబడండి. ఆ తర్వాత తుంటి భాగాన్ని కాస్త వంపినట్టుగా ఉంచి ముందుకు వంగి ఉండండి. ఇలా మరో కాలుతో కూడా పునరావృతం చేయండి.

మణికట్టుతో స్ట్రెచెస్ : ఒక చేతిని ముందుకి చాచి, అరచేతిని పైకి చూపిస్తూ, ముంజేతిలో సాగినట్లు అనిపించేంత వరకు మణికట్టును.. మరో చేత్తో మెల్లగా కిందికి వంచండి. మరో చేత్తోనూ ఇలాగే చేయండి.

చీలమండతో రొటేషన్స్ : మీ చీలమండలలో చలనశీలత, వశ్యతను మెరుగుపరచడానికి ఈ స్ట్రెచ్ ను కూర్చొని, లేదా నిల్చొని కూడా చేయవచ్చు. చీలమండలను ముందుగా సవ్యదిశలో, ఆ తర్వాత అపసవ్య దిశలో తిప్పండి.

డీప్ బ్రీత్: ప్రశాంతంగా ఉన్న స్థలంలో నిటారుగా కూర్చొని.. మీకు నచ్చితే కళ్లు మూసుకోండి. ఆ తర్వాత లోపలికి డీప్ గా శ్వాసను తీసుకోండి. మీ ముక్కు ద్వారా గాలి పీల్చుకోండి. అలానే నోటి ద్వారా ఊపిరి పీల్చుకోండి.