నిజామాబాద్ జిల్లాలో శిథిలావస్థకు చేరిన 10 బస్టాండ్లు

నిజామాబాద్ జిల్లాలో  శిథిలావస్థకు చేరిన 10  బస్టాండ్లు

నిజామాబాద్, వెలుగు: ప్రజలు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని ప్రచారం చేస్తున్న యాజమాన్యం బస్టాండ్‌‌‌‌ల నిర్వహణ గాలికొదిలేసింది. ఉమ్మడి జిల్లాలో 10 బస్టాండ్లు శిథిలావస్థకు చేరడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. సాక్షాత్తూ ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లాలో మారుమూల మండలాల్లో బస్టాండ్ల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో 1989 తెలుగు కాంతి పథం స్కీమ్​ కింద 36 మండలాల్లో రూ.25 లక్షలతో బస్టాండ్లను నిర్మించారు. గత 34 ఏళ్లుగా బస్టాండ్ల నిర్వహణపై  ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యం వహించడంతో అవి శిథిలావస్థకు చేరాయి. కొన్ని చోట్ల గ్రామాలకు దూరంగా నిర్మించిన బస్టాండ్లు నిరూపయోగంగా మారాయి. వీటిలో చాలా బస్‌‌ స్టేషన్లు శిథిలావస్థకు చేరుకుని పైకప్పు పెచ్చులు ఊడిపోతున్నాయి.  కోటగిరి, నిజాంసాగర్, జుక్కల్, పిట్లం, బిచ్కుంద ఆర్టీసీ బస్టాండ్లు మరీ అధ్వానంగా ఉన్నాయి.

నేతల ఇలాకాలో... 
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న బాజిరెడ్డి గోవర్ధన్‌‌‌‌ ఏడాది కింద ఆర్టీసీ చైర్మన్‌‌‌‌గా నియమితులయ్యారు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌‌‌‌రెడ్డి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రిగా..బన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌‌‌‌రెడ్డి స్పీకర్‌‌‌‌‌‌‌‌గా కొనసాగుతున్నారు.  కానీ  వారి నియోజకవర్గాల్లోనే ఆర్టీసీ బస్టాండ్ల రిపేర్లకు నిధులు మంజూరులో చేయించడంలో విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి.  

ప్రైవేట్ వాహనాలే దిక్కు
ఊరుకు దూరంగా బస్టాండ్ కట్టిన్రు. బస్సు ఎక్కాలంటే 3 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాలి. దీంతో చాలా మంది  ప్రైవేట్ వాహనాలు ఎక్కుతున్నారు. బస్సుల్లోనే ప్రయాణించాలని చెప్పే ఆఫీసర్లు బస్టాండ్లను ఎందుకు పట్టించుకుంట లేరు.

- సంగెం సాయిలు, కోటరిగి

ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు
కోటగిరి బస్టాండ్‌‌‌‌లో కనీస వసతులు లేవు. నిర్వహణపై అధికారుల దృష్టి పెట్టడం లేదు. ఫలితంగా బస్టాండ్లు శిథిలావస్థకు చేరాయి. స్థానిక ఎమ్మెల్యే కూడా బస్టాండ్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌కు కృషి చేయడం లేదు.  

- మనోహర్, ఎంపీటీసీ, కోటగిరి