చైనాపై 100% టారిఫ్‌‌‌‌లు.. ఇప్పటికే 30% అమలు.. ట్రేడ్వార్‌‌‌‌‌‌‌‌కు మళ్లా తెరలేపిన ట్రంప్

చైనాపై 100% టారిఫ్‌‌‌‌లు.. ఇప్పటికే 30% అమలు.. ట్రేడ్వార్‌‌‌‌‌‌‌‌కు మళ్లా తెరలేపిన ట్రంప్
  • రేర్ ఎర్త్​ మెటల్స్‌‌‌‌పై నియంత్రణకు ప్రతీకారంగా నిర్ణయం
  • కుప్పకూలిన అమెరికా సహా ప్రపంచ స్టాక్​ మార్కెట్లు
  •  ట్రంప్​, జిన్​పింగ్​ మీటింగ్​పై సందిగ్ధత

వాషింగ్టన్: చైనా దిగుమతులపై అదనంగా 100 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌‌‌‌ ట్రంప్‌‌‌‌ ప్రకటించారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఈ టారిఫ్‌‌‌‌లు అమల్లోకి రానున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే చైనాపై 30 శాతం సుంకాలు విధించిన ట్రంప్.. అకస్మాత్తుగా మరోమారు టారిఫ్‌‌‌‌లతో విరుచుకుపడ్డారు. అమెరికాకు అరుదైన ఖనిజాలు ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించిన నేపథ్యంలోనే ట్రంప్​ ఈ నిర్ణయం తీసుకున్నట్టు నిపుణులు చెబుతున్నారు.

 చైనా ఇటీవల రేర్ ఎర్త్ మెటల్స్ (అరుదైన ఖనిజ లోహాలు)పై కొత్త ఎగుమతి నియంత్రణలు విధించింది. ఇందులో భాగంగా విదేశీ కంపెనీలు రేర్ ఎర్త్ మెటల్స్​ఎగుమతులకు ప్రత్యేక అనుమతులు తీసుకోవాలి. ఈ ఖనిజాలు ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ), స్మార్ట్‌‌‌‌ ఫోన్లు, విమానాలు, సైనిక రాడార్‌‌‌‌లు, డిఫెన్స్ టెక్నాలజీ లాంటి కీలక ఉత్పత్తులకు అత్యవసరం. చైనా ప్రపంచంలో 90% పైగా ఈ ఖనిజాల ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి దీని ద్వారా అమెరికా, ఇతర దేశాలపై ఒత్తిడి తీసుకురావడం ట్రంప్‌‌‌‌కు ‘అతి ఆక్రమణాత్మక’చర్యగా కనిపించింది. ట్రంప్ దీనిని ‘చాలా శత్రుత్వపూరితమైన’ 
చర్యగా అభివర్ణిస్తూ.. టారిఫ్‌‌‌‌ బాంబ్​ పేల్చారు.

అరుదైన ఖనిజాల్లో చైనాదే ఆధిపత్యం

ప్రస్తుతం చైనా నుంచి అమెరికా ఇంపోర్ట్‌‌‌‌ చేసుకునే దాదాపు ప్రతి ప్రొడక్ట్‌‌‌‌పై ఇప్పటికే భారీ టారిఫ్‌‌‌‌లు అమల్లో ఉన్నాయి.  సగటు టారిఫ్ రేటు దాదాపు 40 శాతంగా ఉంది.  స్మార్ట్‌‌‌‌ఫోన్స్‌‌‌‌ దగ్గరనుంచి ఫైటర్ జెట్స్‌‌‌‌ లాంటి డిఫెన్స్ ​ప్రొడక్ట్స్‌‌‌‌లో వినియోగించే రేర్ ఎర్త్‌‌‌‌ ఖనిజాల ప్రాసెసింగ్‌‌‌‌లో ప్రపంచ ఆధిపత్యం చైనాదే. ఈ అంశమే అమెరికా, చైనా మధ్య ట్రేడ్​వార్‌‌‌‌‌‌‌‌కు తెరలేపింది. ఇటీవల ఈ ఖనిజాల మైనింగ్, స్మెల్టింగ్, మాగ్నెట్ ఉత్పత్తికి సంబంధించిన టెక్నాలజీపై ఎక్స్‌‌‌‌పోర్ట్​ లైసెన్స్‌‌‌‌లను చైనా తప్పనిసరి చేసింది. డిఫెన్స్​, సెమీకండక్టర్ సహా సెన్సిటివ్‌‌‌‌ రంగాల్లో ఈ పదార్థాలను ఉపయోగించకుండా నియంత్రించింది.  

లిథియం బ్యాటరీలు, గ్రాఫైట్ యానోడ్ పదార్థాలపై దీని ప్రభావం పడింది. ఈ కొత్త ఆంక్షలు నవంబర్, డిసెంబర్ మధ్య పూర్తిగా అమల్లోకి వస్తాయని చైనా ప్రకటించింది. ఈ నిర్ణయం.. దేశంలోనే రేర్​ఎర్త్​ప్రొడ్యూసర్‌‌‌‌‌‌‌‌ అయిన ఎంపీ మెటీరియల్స్​లో 400 మిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టి దేశీయంగా అరుదైన ఖనిజాల మైనింగ్ లో సామర్థ్యాన్ని పెంచుకోవాలని చూసిన  అమెరికాపై తీవ్ర ప్రభావం చూపింది. మరోవైపు మార్కెట్లలో అనిశ్చితి ఎదురైనా అమెరికా ఆందోళన చెందదని చాటిచెప్పేందుకే ట్రంప్ ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకొని ఉంటారని నిపుణులు పేర్కొన్నారు.

కుప్పకూలిన స్టాక్​ మార్కెట్లు

చైనాపై మళ్లీ టారిఫ్​ వార్​కు ట్రంప్​ తెరలేపడంతో స్టాక్​ మార్కెట్లు కుప్పకూలాయి. ముఖ్యంగా అమెరికా మార్కెట్లలో బ్లడ్​ బాత్​ కనిపించింది.  కీలకమైన డౌజోన్స్ ఇండెక్స్​ 2 శాతం దాకా, నాస్​డాక్  ఇండెక్స్​ 3.5 శాతం వరకు పడిపోయాయి. ఇతర దేశాల స్టాక్​ మార్కెట్ల పరిస్థితీ ఇంతే. ఇక, అమెరికాలో ట్రేడ్​ అయ్యే ఇండియా ఇండెక్స్​ ‘గిఫ్ట్​ నిఫ్టి’ దాదాపు 200 పాయింట్లు నష్టపోయింది. 

అందుకే వచ్చే నెల దాకా గడువు

చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ తో సమావేశాన్ని రద్దు చేసుకున్నట్లు జరుగుతున్న  ప్రచారాన్ని ట్రంప్ తోసిపుచ్చారు. చైనా అధ్యక్షుడితో భేటీ యథావిధిగానే జరుగుతుందని, అయితే, సుంకాల విషయంలో మాత్రం చైనా స్పందనను బట్టే ముందుకెళతామని వివరించారు. వంద శాతం సుంకాల అమలును వచ్చే నెల నుంచి అమలు చేస్తామని చెబుతున్నా.. చైనా తీసుకోబోయే చర్యలతో రేపే అమలులోకి తీసుకొచ్చే అవకాశం లేకపోలేదని ట్రంప్​ తెలిపారు. అరుదైన ఖనిజాల ఎగుమతులపై ఆంక్షల విషయంలో డ్రాగన్ కంట్రీ వెనక్కి తగ్గితే తాము కూడా అదనపు సుంకాలను రద్దు చేసే విషయాన్ని పరిశీలిస్తామని అన్నారు. ఇందుకోసమే వచ్చే నెల 1 వరకు గడువు పెట్టినట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు.