యాచారంలో 100 కుక్కలకు విషం.. ఇంజక్షన్లు వేసి చంపి.. ఊరవతల పాతిపెట్టారు

యాచారంలో  100 కుక్కలకు విషం.. ఇంజక్షన్లు వేసి చంపి.. ఊరవతల పాతిపెట్టారు
  • సర్పంచ్, పంచాయతీ సెక్రటరీపై స్ట్రే యానిమల్స్ ఫౌండేషన్ ఫిర్యాదు 
  • ముగ్గురు వ్యక్తులను రప్పించి, కుక్కలను చంపించినట్టు వెల్లడి 
  • మాజీ ఎంపీ, యాక్టివిస్ట్ మేనకా గాంధీకి సమాచారం 
  • కలెక్టర్​కు ఫోన్ చేసి, వివరాలు అడిగిన మేనక   
  • కేసు నమోదు చేసి, కుక్కలను పాతిన చోటును గుర్తించిన పోలీసులు   
  • నేడు పోస్టుమార్టం నిర్వహించే అవకాశం

ఇబ్రహీంపట్నం, వెలుగు: కొద్దిరోజుల కింద కామారెడ్డి జిల్లాలో 400 కుక్కలకు విషపు ఇంజక్షన్లు ఇచ్చి చంపిన ఘటన మరువకముందే అలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లా యాచారం గ్రామ పంచాయతీ పరిధిలో మరోటి జరిగింది. గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి సుమారు100 కుక్కలకు విషపు ఇంజక్షన్లు ఇచ్చి చంపించారని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ యాచారం పోలీస్​స్టేషన్​లో స్ట్రే యానిమల్స్ ఫౌండేషన్ ప్రతినిధి ముదావత్ ప్రీతి మంగళవారం ఫిర్యాదు చేశారు. 


ఈ విషయమై యానిమల్​రైట్స్​యాక్టివిస్ట్, మాజీ ఎంపీ​మేనకా గాంధీకి కూడా ఫోన్​ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో స్పందించిన ఆమె.. జిల్లా కలెక్టర్​నారాయణ రెడ్డికి కాల్​చేసి వివరాలడిగారు. దీంతో ఆయన పోలీసులతో మాట్లాడారు. యాచారం గ్రామ పంచాయతీలో సుమారు 8 వేల మంది జనాభా ఉండగా, ఇక్కడ భారీ సంఖ్యలో కుక్కలు తిరుగుతున్నాయని, పిల్లలను కరుస్తున్నాయని సర్పంచ్​మస్కు అనిత, గ్రామ పంచాయతీ కార్యదర్శి కిషన్ నాయక్ కు గ్రామస్తులు పలుమార్లు ఫిర్యాదు చేశారు. 

కోళ్లు, మేకలను కూడా బతకనివ్వడం లేదని చెప్పారు. ఈ క్రమంలో ఈ నెల19న ఉదయం 9 గంటలకు సర్పంచ్ అనిత, పంచాయతీ కార్యదర్శి కిషన్ నాయక్ 100 వీధి కుక్కలకు విషపు ఇంజెక్షన్లు ఇప్పించి చంపించారని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. కుక్కలను చంపిన తర్వాత ట్రాక్టర్​లో వేసుకుని ఊరవతల ఉన్న అటవీ ప్రాంతంలో పాతిపెట్టారని తెలిపారు. ఇందుకోసం బయటి నుంచి ముగ్గురు ప్రొఫెషనల్స్​ను రప్పించినట్టు తెలుస్తోంది. 

వారు కుక్కలను చంపే పనిలో ఎక్స్​పర్ట్స్​కావడంతో కేవలం రెండు నుంచి మూడు గంటల్లోనే100 కుక్కలకు లెథల్ ఇంజక్షన్లు ఇచ్చి చంపేశారని సమాచారం. ఈ ఇంజక్షన్​వేసిన వెంటనే కుక్కలు అక్కడికక్కడే పడిపోతాయి. ఊపిరితిత్తులు పని చేయడం ఆగి, కొద్దిసేపటికే గుండె కొట్టుకోవడం బంద్ అవుతుందని చెప్తున్నారు. కుక్కలు వేగంగా పరిగెత్తుతున్నా ఈ ఇంజక్షన్లు వాటికి గుచ్చుకునేలా విసరడంలో గ్రామానికి వచ్చిన ప్రొఫెషనల్స్​సిద్ధహస్తులని తెలిసింది. 

నేడు కుక్కల కళేబరాలకు పోస్టుమార్టం 

యానిమల్​ఫౌండేషన్​ ఫిర్యాదు, మేనకా గాంధీ చొరవతో విచారణ స్పీడప్​చేసిన సీఐ నందీశ్వర్ రెడ్డి కేసు నమోదు చేసి, కుక్కలను పాతి పెట్టిన చోటును గుర్తించారు. బుధవారం పొద్దు పోవడంతో గురువారం ఉదయం వాటినన్నింటినీ వెలికి తీసి పోస్ట్​మార్టం చేయనున్నట్టు తెలిసింది. కాగా, ఈ విషయంపై 20వ తేదీన సర్పంచ్​తో పాటు వార్డు మెంబర్​కు జంతువుల రక్షణ కార్యకర్త అంజలి, గౌతమ్ కాల్​చేయగా వేర్వేరు సమాధానాలిచ్చారు. 

ఒకరేమో అనస్తీషియా ఇచ్చి వేరే చోటికి తరలించామని చెప్పగా, మరొకరు రీలొకేట్​చేశామని సమాధానం ఇచ్చారు. అలాగే, గ్రామానికి చెందిన ఒకరి పెంపుడు కుక్క కూడా ఇందులో చనిపోవడంతో ఆవేదనతో వారు బయట మాట్లాడినట్టు తెలిసింది. ఇదంతా స్ట్రే యానిమల్స్ ఫౌండేషన్ ప్రతినిధి ముదావత్ ప్రీతికి చేరడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు మేనకా గాంధీకి కాల్​చేసి చెప్పారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి కిషన్ ను ఫోన్​లో సంప్రదించగా స్పందించలేదు.