
ఉత్తరాఖండ్ లో వరద పరిస్థితులు ఏర్పడ్డాయి. ఛమోలీ జిల్లాలోని తపోవన్ ఏరియాలో ధోలీగంగా నదిలో కొండచరియలు విరిగిపడటంతో.. వరద ప్రవాహం అనూహ్యంగా పెరిగింది. దాంతో రైనీ అనే గ్రామం దగ్గర ఉన్న రిషిగంగా పవర్ ప్రాజెక్ట్ కు నష్టం వాటిల్లింది. ఈ ప్రాజెక్టులో పని చేస్తున్న దాదాపు 150 మంది కార్మికులు గల్లంతయ్యారు. వరదల ప్రభావం ఉత్తర ప్రదేశ్‌పై కూడా పడింది. వరద ప్రవాహంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అలర్ట్ అయింది. ధోలీగంగా నది వెంబడి ఉన్న గ్రామాల నుంచి ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.
ప్రమాదస్థలంలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, NDRF,ITBP బలగాలు సహాయకచర్యల్లో పాల్గొంటున్నాయి. నాలుగు ఆర్మీ టీంలు, రెండు మెడికల్ టీంలు, ఇంజినీరింగ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది స్పాట్ కు చేరుకున్నారని అధికారులు చెప్పారు. మరోవైపు.. చమోలీలోని NTPC సైట్ లో 10 డెడ్ బాడీలను గుర్తించారు. తపోవన్ డ్యాం దగ్గర వరదలో చిక్కుకున్న 16 మందిని కాపాడి.. సురక్షిత ప్రాంతానికి తరలించామని ఉత్తరాఖండ్ డీజీపీ తెలిపారు.
అక్కడి ప్రభుత్వం డిజాస్టర్ మేనేజ్ మెంట్ డిపార్ట్ మెంట్ ను అలర్ట్ చేసింది . సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ పరిస్థితిని సమీక్షించారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని… రూమర్స్ నమ్మొద్దని సీఎం సూచించారు. అలకనందా నది వెంబడి కూడా ప్రజలను ఖాళీ చేయించాలని ఆదేశించారు సీఎం. స్పాట్ కు వెళ్లిన ఆయన.. పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. 100 నుంచి 150 మంది వరకు వరదలో గల్లంతైనట్టు ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రకటించారు.