వందేళ్ల మిస్టరీ: ఇంతకీ బాబీ ఏమయ్యాడు? 

వందేళ్ల మిస్టరీ: ఇంతకీ బాబీ ఏమయ్యాడు? 

అది 1912, ఆగస్టు 23. అమెరికాలోని లూసియానాలో ఒక పిల్లాడి మిస్సింగ్‌‌ కేసు నమోదైంది. ప్రపంచంలో ప్రతి సంవత్సరం లక్షల్లో మిస్సింగ్‌‌ కేసులు రికార్డు అవుతుంటాయి. వాటిలో ఇదొకటి! అందులో వింతేముంది? అంటారా. మిస్సవ్వడంలో వింత లేదు. కానీ.. కొన్ని ఇన్సిడెంట్ల వల్ల ఈ కేసు మిస్టరీగా మారింది. దాని గురించి మీడియాలో కథనాలు కొన్నేళ్లపాటు వచ్చాయి. ఎక్కడ చూసినా ఈ కేసు గురించే మాట్లాడుకున్నారు. అంతలా మాట్లాడుకోవాల్సిన మిస్టరీ ఏముంది ఆ కేసులో తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే...

పెర్సీ డంబర్‌‌‌‌, లెస్సీ దంపతులు తమ పిల్లలు అలెన్‌‌జో, బాబీలతో కలిసి అమెరికాలోని ఒపెలోసాస్‌‌లో ఉండేవాళ్లు. ఒకరోజు ఫ్యామిలీ ఫ్రెండ్స్‌‌తో కలిసి సరదాగా గడిపేందుకు లూసియానా దగ్గర్లోని స్వేజ్‌‌ లేక్‌‌ ప్రాంతానికి ట్రిప్‌‌కు వెళ్లారు. కానీ.. అక్కడికి వెళ్లిన కొద్దిసేపటికి పెర్సీకి ఏదో పనిపడింది. అతను క్యాబిన్‌‌ నుంచి వెళ్లిపోయాడు. బాబీ కూడా వాళ్ల నాన్నతో కలిసి వెళ్తానని మారాం చేశాడు. అయినా.. బాబీని తీసుకెళ్లకుండా పెర్సీ వెళ్లిపోయాడు. బాబీకి బాగా కోపం వచ్చి, తన  హ్యాట్‌‌ని చించేశాడు. తర్వాత లేక్ దగ్గరకి వెళ్తానని మళ్లీ మారాం చేశాడు. దాంతో వాళ్ల ఫ్యామిలీ ఫ్రెండ్‌‌ పాల్‌‌, బాబీని లేక్ దగ్గరకు తీసుకెళ్లాడు. వీళ్లతోపాటు మరికొందరు కూడా వెళ్లారు. చీకటి పడేసరికి క్యాబిన్ దగ్గరకు తిరిగి వచ్చేశారు. అందులో బాబీ లేకపోవడం లెస్సీ గమనించి... ‘‘బాబీ ఎక్కడ?’’ అని పాల్‌‌ని అడిగింది. ఆమె అడిగాకే బాబీ మిస్‌‌ అయ్యాడని గమనించాడు పాల్​. దాంతో వాళ్లిద్దరూ లేక్‌‌ దగ్గరకు వెళ్లి, బాబీని వెతకడం మొదలుపెట్టారు. అలా చాలాసేపు వెతికారు. కానీ.. బాబీ కనిపించలేదు. దాంతో వాళ్ల నాన్న దగ్గరికి వెళ్లాడేమో అనుకుంది లెస్సీ. ఆ ఆలోచన రావడం ఆలస్యం కొంతమందిని పెర్సీ పనిచేసే వైపు వెతుకుతూ వెళ్లమని చెప్పింది. అంతలోనే పెర్సీ అక్కడికి వచ్చాడు. బాబీ తన దగ్గరకి కూడా రాలేదని చెప్పాడు. తర్వాత సెర్చర్స్​ని పిలిపించి వెతికించారు. ఆ రోజు రాత్రంతా చాలామంది అక్కడంతా గాలించారు. కానీ.. బాబీ దొరకలేదు. దాంతో పోలీసులకు కంప్లైంట్‌‌ చేశారు. అప్పటికే చీకటైంది. బాబీ లేక్‌‌లో పడిపోయాడనుకుని లేక్‌‌లో కూడా వెతికించారు. ముందుగా యాంకర్‌‌‌‌ వేసి వెతికారు. కానీ, బాబీ ఆచూకీ మాత్రం దొరకలేదు. తర్వాత గజ ఈతగాళ్లు కూడా లేక్‌‌లో వెతికారు. అయినా దొరకలేదు. ఇంతకీ బాబీ ఏమయ్యాడు.?

మొసళ్లు తిన్నాయా? 

బాబీ ఆ లేక్‌‌లో పడిపోయాడని చాలామంది నమ్మారు. సరస్సులో వెతికించినా బాబీ ఆనవాళ్లు దొరకలేదు. కనీసం బాబీ వేసుకున్న డ్రెస్​ తాలూకా చిన్న గుడ్డ ముక్క కూడా దొరకలేదు. అప్పుడు ఆ లేక్‌‌లో కొన్ని మొసళ్లు ఉండేవి. అవి బాబీని తిన్నాయేమో అనే అనుమానంతో వాటి మీద కూడా రీసెర్చ్‌‌ చేయించాడు. అందులో అవి బాబీని తినలేదని తెలిసిపోయింది. ఆ లేక్‌‌ చుట్టూ ఉండే అడవిలో ఉండే జంతువులు తిన్న ఆనవాళ్లు కూడా దొరకలేదు. ఆ అడవి గుండా ఒక రైలు మార్గం ఉంది. దానిగుండా ఎవరైనా ఎత్తుకెళ్లారేమో భావించారు. అలా కూడా వెతికారు. అయినా లాభం లేకపోయింది. ఆ లేక్‌‌ చుట్టుపక్కల ఉన్న ఏరియాలకు మిస్సింగ్‌‌ పోస్ట్‌‌ కార్డ్స్‌‌ పంపారు. అయినా బాబీ ఆచూకీ మాత్రం దొరకలేదు. 

ఆచూకీ చెప్తే వెయ్యి డాలర్లు

ఒపెలోసాస్‌‌లోని ప్రజలంతా కలిసి, వెయ్యి డాలర్లు కలెక్ట్‌‌ చేసి.. బాబీ ఆచూకీ చెప్పినవాళ్లకు ఇస్తామని ప్రకటించారు. అయినా... ఎటువంటి ఇన్‌‌ఫర్మేషన్‌‌ రాలేదు. అలా... బాబీ కోసం వెతుకుతూనే ఉన్నారు. ఎనిమిది నెలలు గడిచిపోయాయి. అందరూ బాబీ మీద ఆశలు వదులుకున్నారు. కలెక్ట్‌‌ చేసిన వెయ్యి డాలర్లు తిరిగి ఇచ్చేశారు. తరువాత సరిగ్గా వారం రోజులకు కథ మలుపు తిరిగింది. బాబీ మిసిసిపీలోని ఫాక్స్‌‌వర్త్‌‌లో ఉన్నట్టు తెలిసింది. 

దొరికాడా! 

బాబీ కనిపించాడని తెలియగానే పెర్సీ, లెస్సీ మిసిసిపీకి వెళ్లారు. విలియం వాల్టర్స్‌‌ అనే వ్యక్తి ఇంట్లో బాబీ ఉన్నట్టు తెలుసుకుని అతని దగ్గరికి వెళ్లారు. కానీ, ఆ అబ్బాయి బాబీ కాదని, బ్రూస్‌‌  అని చెప్పాడు విలియం. కానీ.. అతను అచ్చం బాబీలాగే ఉన్నాడు. బాబీ గుర్తులు కూడా సరిగ్గా ఉన్నాయి. బాబీ ఎడమ కాలి బొటన వేలికి కాలిన గాయం, మెడపై పెద్ద పుట్టుమచ్చ ఉంటాయి. ఆ రెండు గుర్తులు ఆ అబ్బాయికి కూడా ఉన్నాయి. దాంతో లెస్సీ ఆ అబ్బాయి బాబీనే అని కన్‌‌ఫర్మ్‌‌ చేసింది. పైగా ఆ అబ్బాయిని విలియం ఎప్పుడూ కొడుతుంటాడని చుట్టుపక్కల వాళ్లుచెప్పారు. బాబీని లెస్సీ తీసుకెళ్లిపోయింది. కానీ.. బాబీ ఇదివరకటిలా వాళ్లతో ఉండలేకపోయాడు. ఆ తర్వాత విలియం.. జూలియా ఆండర్సన్‌‌ అనే ఆవిడని తీసుకొచ్చి ‘బాబీ తన కొడుక’ని చెప్పాడు. విలియం వాళ్ల అన్న ఫ్లాయిడ్‌‌, వదిన జూలియాలకి పుట్టినవాడే బ్రూస్‌‌. కానీ.. ఆ ఇద్దరు విడిపోవడంతో బ్రూస్‌‌ని విలియం పెంచుతున్నాడన్నారు. దాంతో కేసు కోర్టుకెక్కింది. ఆ టైంలో న్యూస్​ పేపర్లల్లో ఈ కేసు గురించి ప్రతి రోజూ కథనాలు వచ్చేవి. చివరకి సాక్ష్యాలన్నీ పరిశీలించి ఆ అబ్బాయి ‘బాబీ’ అని కోర్టు తీర్పిచ్చింది. విలియంపై కిడ్నాప్‌‌ కేసు పెట్టి, అరెస్ట్‌‌ చేశారు. లెస్సీ, పెర్సీలు బాబీని తీసుకెళ్లారు. బాబీని పెంచి పెద్ద చేశారు. చదువు చెప్పించారు. పెళ్లి చేశారు. ఆయనకు నలుగురు పిల్లలు. మార్చి 8, 1966 న బాబీ చనిపోయాడు. కథ సుఖాంతం అయ్యింది.కానీ.. ఈ కథ సాగినన్ని రోజులు అంటే.. బాబీ చనిపోయేవరకు జూలియా ఆండర్సన్‌‌ కుటుంబీకులు, ఆమె పిల్లలు అతడు బాబీ కాదని, బ్రూస్‌‌ అని వాదిస్తూనే ఉన్నారు. విలియం కూడా కిడ్నాప్‌‌ కేసులో నిర్దోషిగా బయటపడ్డాడు. మరి అతను బ్రూస్‌‌ అయితే... బాబీ ఎక్కడున్నాడు? ఇద్దరూ ఒకే పోలికలతో ఎందుకు ఉన్నారు? అనేది ఇప్పటికీ మిస్టరీనే. 

చనిపోయాక ఏం జరిగింది? 

బ్రూస్‌‌ తన కొడుకే అని తెలిసినా.. ఏం చేయలేక బతికి ఉన్నన్ని రోజులు బాధపడింది జూలియా. ఫిబ్రవరి 1, 1940న చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆమె కుటుంబం బాబీని బ్రూస్ గానే చూసింది. ఏదో ఒక రోజు అందరికీ నిజం తెలుస్తుందనే ఆశతో ఉన్నారు. 1960లో ఒక అపరిచితుడు మిసిసిపీలోని జూలియా ఇంటి ముందు పదే పదే తిరుగుతూ కనిపించాడు. ‘‘నువ్వెవరు?’’ అని అడిగితే.. “నా పేరు బాబీ డంబర్‌‌‌‌. నేను ఒపెలోసాస్ నుంచి వచ్చాన’’ని  చెప్పాడు. బాబీ చనిపోవడానికి ఐదారేళ్ల ముందు ఇది జరిగింది. అంటే.. బాబీకి తను బ్రూస్‌‌ అనే విషయం తెలుసా? తెలిస్తే మరి లెస్సీ దగ్గర ఎందుకు ఉండిపోయాడు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే బాబీ చనిపోయాడు. కానీ.. ఈ రెండు కుటుంబాల్లో బాబీ గురించి అనుమానం ఉండేది. దాంతో బాబీ మనవరాలు మార్గరెట్‌‌ డంబర్‌‌‌‌ అసలు విషయం తెలుసుకోవాలి అనుకుంది. 1999 నుంచి తన ఫ్యామిలీ హిస్టరీ తవ్వడం మొదలుపెట్టింది. బాబీ గురించి పత్రికల్లో వచ్చిన ఆర్టికల్స్‌‌ అన్నీ చదివింది. అన్ని ఆధారాలు సేకరించింది. చివరకు 2004లో డీఎన్‌‌ఏ పరీక్ష చేసి బాబీగా పెరిగిన వ్యక్తి బాబీ కాదని తెలుసుకుంది. కానీ, అతను బ్రూస్ ఆండర్సన్ అని కూడా నిరూపించలేకపోయింది. ఆ వ్యక్తి బాబీ అయితే.. బ్రూస్‌‌ ఏమయ్యాడు? ఒకవేళ బ్రూస్‌‌ అయితే.. బాబీ ఏమయ్యాడు? అనే ప్రశ్నలు మాత్రం సమాధానం లేని  ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. మిస్టరీగానే ఉండిపోయాయి.

తల్లిదండ్రులే చంపారా? 

అసలు బాబీ డంబర్‌‌‌‌ని అతని తల్లిదండ్రులే చంపారని చాలామంది చెప్పారు. ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి బ్రూస్‌‌ ఆండర్సన్‌‌ను తమ కొడుకని చెప్పారని తేల్చారు. ఈ వెర్షన్​కు బలం చేకూర్చేలా.. లేక్​కు దగ్గర్లో బాబీ కాలిగుర్తులు కనబడ్డాయి. ఒక వ్యక్తి బాబీని తీసుకెళ్లడం చూశామని ఊరివాళ్ళు కొందరు చెప్పినట్టు అధికారులు చెప్పారు.

::: కరుణాకర్​ మానెగాళ్ల