ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, రవీంద్రనాథ్ ఠాగూర్, సి.వి. రామన్, జార్జ్ బెర్నార్డ్ షా, దలైలామా, స్టీవ్ జాబ్స్, చార్లీ చాప్లిన్, ఆంగ్ సాన్ సూకీ, మార్టిన్ లూథర్ కింగ్, నేటి బరాక్ ఒబామా, మలాలా వంటి విభిన్న రంగాల్లోని ప్రపంచ ప్రముఖులకు గాంధీజీ రియల్ హీరో. గాంధీజీ ఆత్మకథ పుస్తకం ‘‘ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పరిమెంట్స్ విత్ ట్రూత్” ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందింది. అంతెందుకు వందేళ్ల తర్వాత కూడా ఈ పుస్తకం ఇంకా బెస్ట్ సెల్లర్‌గా కొనసాగుతూనే ఉంది!
‘‘గాంధీజీ ఆత్మకథను ప్రతి ఒక్కరూ చదవాలి. ఈ పుస్తకంలో తన తప్పులను కూడా నిర్భయంగా, నిజాయితీగా ఒప్పుకున్న విధానం అద్భుతం. సత్యానికి ఇంతలా కట్టుబడిన ఆత్మకథ మరొకటి లేదంటా’’రు ఓ విశ్వవిఖ్యాత రచయిత. గాంధీజీ తన ఆత్మకథను గుజరాతీ భాషలోనే రాశారు. బాల్యం నుంచి 1921వ సంవత్సరం వరకు తన జీవిత విశేషాలను, అనుభవాలను సత్యానికి అనుసంధానం చేస్తూ వివరించిన ఈ కథ.. 1925–28 మధ్యకాలంలో ‘నవజీవన్’ అనే వారపత్రికలో ధారావాహికగా వచ్చింది. నిజాయితీ, సహనం, శాంతి, ప్రేమ, చిత్తశుద్ధి, వినయం లాంటి మానవీయ విలువలతో ఈ పుస్తక ప్రయాణం కొనసాగింది. సత్యానికి కట్టుబడి ఉండడమే సత్యాగ్రహమంటూ ఆధ్యాత్మిక సూత్రాలను శాస్త్రీయ స్ఫూర్తితో ఆచరణాత్మక పరిస్థితులకు అన్వయిస్తూ రాశారు. అందువల్లే గాంధీ ఆత్మకథ కాలం గుండెపై కోటి సూర్యుల జ్ఞాన వెలుగై ప్రకాశిస్తోంది. గాంధీజీ నైతిక, మత సామరస్య, అహింసా ప్రేమతత్వ జీవన విధానం విశ్వవ్యాప్తంగా వ్యక్తిత్వ వికాస పాఠ్య గ్రంథమయ్యింది. చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన, ప్రభావవంతమైన వంద పుస్తకాల్లో ఒకటిగా ఇది గుర్తింపుపొందింది.17 భారతీయ భాషలతో పాటు స్పానిష్, జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్, కొరియన్, జపనీస్, చైనీస్ తదితర ప్రపంచ ప్రముఖ భాషల్లోకి అనువాదం అయ్యింది. ఇప్పటివరకు దాదాపు1.2 కోట్ల కాపీలు అమ్ముడుపోయాయి. ‘సత్యశోధన’, ‘సత్యంతో నా ప్రయోగాలు’ పేరుతో ఈ పుస్తకం ప్రజల జీవితాల్లో శాంతి వెలుగులను పంచుతూనే ఉంది. ఓ సందర్భంలో.. ‘‘మీరు చూడాల్సింది నా దుస్తులు కాదు. నేను మోసుకొచ్చిన కోట్లాది భారతీయుల ఆకాంక్ష” అంటూ బ్రిటిష్ వారికి బక్క పలుచని గాంధీజీ చెప్పిన సమాధానం ఆయన ధృడ సంకల్ప ఆత్మ బలాన్ని తెలియజేస్తుంది.
‘కాల పరిణామంలో తరాల ఆలోచనలు వేగంగా మారుతూనే ఉంటాయి. మరి నా జీవిత సందేశం ఎంతవరకు కాలాతీతంగా నిలుస్తుంది? భావితరాలు నా ఆత్మకథను ఎందుకు తెలుసుకోవాలి?” అనే ప్రశ్నలను గాంధీ తనకు తానే వేసుకున్నారు. అందుకే తన జీవితాన్ని ఓ సైంటిస్ట్‌లా విశ్లేషించి ఇలా ఆరంభించారు. ‘‘ఆత్మకథ రాయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను అనేక సమయాల్లో ఎన్నో సత్య ప్రయోగాలు చేశాను. ఆ ప్రయోగాల్ని ఆత్మకథగా రూపొందించాలని మాత్రం అనుకున్నాను. నా జీవితం అట్టి సత్య ప్రయోగాలతో నిండి ఉంది. మొదట దైవమే సత్యము అనే దశ నుంచి.. సత్యమే దైవం అనే స్థాయిని పొంది.. సత్యమయం కావడానికి అహింసే ఏకైక మార్గం’ అంటారు గాంధీజీ. భారతీయుల హక్కుల కోసం, అధికారాల కోసం ఎంత గట్టిగా బ్రిటిష్ వారిపై ఉద్యమించారో.. భారతీయుల్ని సంస్కరించడానికి కూడా అంతే కృషి చేశాడని ఈ పుస్తకం చదివితే పాఠకులకు అర్థం అవుతుంది. మన స్వాతంత్ర సంగ్రామంలోనే కాదు.. నేటికీ సత్యాగ్రహం అనేది ప్రపంచంలోని అసమానతలు, అస్పృశ్యత విధానాలు, వివక్షతలు, అమానవీయ ఘటనలు వంటి తదితర అనాగరిక అంశాలపై నిత్యం యుద్ధం చేస్తూనే ఉంది. 1982లో విడుదలైన ‘గాంధీ’ సినిమా విశేషమైన ప్రేక్షకాదరణ పొందింది. 127 మిలియన్ డాలర్లు వసూలు చేసి.. 8 ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది. భాను అథియా ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఆస్కార్ అందుకుని, ఆ గౌరవాన్ని పొందిన తొలి భారతీయురాలుగా చరిత్ర సృష్టించారు. ఈ సినిమాకు రిచర్డ్ అటెన్ బరో దర్శకత్వం వహించారు.
ప్రస్తుత అధునాతన శాస్త్ర, సాంకేతిక ప్రపంచం జీవన విలువల సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ.. ఆధిపత్యం, అణుయుద్ధం, ఆర్థికమాంద్యం, పర్యావరణ విపత్తుల నీడలో జీవిస్తోంది. శాంతి, ప్రేమలు కనుమరుగై హింస రాజ్యమేలుతుంటే.. కోట్ల సంఖ్యలో అమాయక ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో మళ్లీ మన జగతిని జాగృతం చేయడానికి గాంధీజీ ఆత్మకథ, ఆయన జీవన విధానాలే అన్ని రంగాల్లో దిక్సూచిగా పనిచేస్తున్నాయి. గాంధీఇజం నేడు విశ్వవ్యాప్తం. అందుకే జెన్ – జడ్ నవతరానికి ఆధునికతతో కూడిన గాంధీజీ జీవితం విద్యాసంస్థల్లో జీవన పాఠ్యాంశం కావాలి. దయాగుణం, మర్యాద, గౌరవం, సహానుభూతి, సహనం, విశ్వాసం తదితర జీవిత విలువలను నేర్పాలి. అందరం మళ్లీ గాంధీ జీవితాన్ని పఠించాలి. గాంధీ ఆత్మకథ పుస్తకాలను పిల్లలకు బర్త్ డే గిఫ్ట్‌లుగా అందించి.. చదివించి.. విశ్వశాంతికై పాటుపడాలి. యుద్ధాలు లేని ప్రేమమయ ప్రపంచాన్ని సృష్టించాలి. ‘‘వెయ్యేళ్ల తర్వాత కూడా ‘‘గాంధీ సత్య వెలుగు’’ ప్రపంచమంతా అసంఖ్యాక హృదయాలకు ప్రేరణ ఇస్తుందం’’టూ మన దేశ మొదటి ప్రధాని నెహ్రూ చెప్పిన మాటలను మనమంతా గుర్తుచేసుకుందాం. గాంధీ పుట్టిన దేశమంటూ యావత్ ప్రపంచం మనల్ని కీర్తిస్తున్న తీరును చూసి గర్వపడదాం.
‘‘సంభవామి అని ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్గీత...
ఈ బోసి నోటి తాత..!’’
మహాత్ముడి గురించి సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన అమృతాక్షరాలివి. యావత్ ప్రపంచం దాదాపు కొన్ని దశాబ్దాలుగా ఆయన స్ఫూర్తిని కొనియాడుతూ, జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటూనే ఉంది. గాంధీ తత్వానికి గుర్తింపుగా ఐక్యరాజ్యసమితి ప్రపంచవ్యాప్తంగా శాంతి, అహింస సందేశాలను వ్యాపింపచేయాలి అనుకుంది. అందుకే 2007లో ఆయన జయంతి అక్టోబర్ 2ను ‘అంతర్జాతీయ అహింసా దినోత్సవం’గా ప్రకటించింది.
- ఫిజిక్స్ అరుణ్ కుమార్
లైఫ్& లిటరేచర్ పేజీకి వ్యాసాలు పంపాల్సిన మెయిల్ ఐడీ
featureseditor@v6velugu.com

