ఢిల్లీలో ప్రతి మహిళకు నెలకు రూ.1000

ఢిల్లీలో ప్రతి మహిళకు నెలకు రూ.1000
  • 76 వేల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఢిల్లీ సర్కార్
  • గతేడాదితో పోలిస్తే 3.7% తగ్గుదల 
  • కేంద్రం ఒక్క పైసా ఇస్తలేదని అసెంబ్లీలో  కేజ్రీవాల్ ఆవేదన

న్యూఢిల్లీ: దేశరాజధానిలో 18 ఏండ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1000 చొప్పున ఇస్తామని అర్వింద్ కేజ్రీవాల్ సర్కార్ ప్రకటించింది. 'ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన' స్కీమ్ కింద ఈ మొత్తాన్ని అందజేస్తామని వెల్లడించింది. సోమవారం ఢిల్లీ అసెంబ్లీలో ఆ రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ అతిషి రూ. 76 వేల కోట్లతో 2024-–25 బడ్జెట్‌‌ను ప్రవేశ పెట్టారు. గతేడాది ప్రవేశ పెట్టిన బడ్జెట్‌‌(రూ.78,800 కోట్లు)తో పోలిస్తే ఈసారి బడ్జెట్ 3.7 శాతం తగ్గింది. 

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొత్తగా 'ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన' స్కీమ్ ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా 18 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న మహిళలందరికీ ప్రతి నెలా రూ. 1,000 అందజేయాలని నిర్ణయించారు. అందుకోసం కేజ్రీవాల్ సర్కార్ రూ.2 వేల కోట్లు కేటాయించింది. తాజా బడ్జెట్‌‌లో ఆరోగ్యం, విద్య రంగాలకు కేటాయింపులు తగ్గాయి. 

50 లక్షల మంది మహిళలకు లబ్ధి

అసెంబ్లీలో బడ్జెట్‌‌ను ప్రవేశపెడుతున్న సందర్భంగా ఆర్థిక మంత్రి అతిషి మాట్లాడుతూ.."ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన' కోసం 2 వేల కోట్లు కేటాయించాం. ఈ పథకం ద్వారా సుమారు 45 నుంచి 50 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వ ఉద్యోగం చేసే మహిళలు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు పథకానికి అర్హులు కాదు. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వంలో పాఠశాలలు గణనీయంగా మారాయి. 

ఇప్పటివరకు స్కూళ్లల్లో అమలు చేస్తున్న బిజినెస్ బ్లాస్టర్స్ పథకాన్ని ఇకపై యూనివర్సిటీస్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్ (ఐటీఐ)ల్లో అమలు చేస్తం. ఢిల్లీలో 80%(10వేల) ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని నిర్ణయించాం. తద్వారా కాలుష్యాన్ని నివారిస్తాం" అని వివరించారు. 

లోక్‌‌సభ ఎన్నికల తర్వాతే అమలు

బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం సీఎం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.."రామరాజ్యం నుంచి పొందిన స్ఫూర్తితో ఈ బడ్జెట్ తయారు చేశాం. మహిళలందరికీ నెలకు రూ. 1,000 చొప్పున ఇవ్వాలని నిర్ణయించాం. ఇది మహిళా సాధికారత దిశగా ప్రపంచంలోనే అతిపెద్ద అడుగులాంటింది. గతంలో మాకు కేంద్రం నుంచి రూ. 325 కోట్లు మాత్రమే వచ్చేవి. ఇప్పుడు ఆ నిధులు కూడా ఆగిపోయాయి. ప్రస్తుతం కేంద్ర పన్నుల నుంచి మాకు ఒక్క పైసా కూడా రావడం లేదు. ఇది బంగారు గుడ్లు పెట్టే కోడి గొంతు కోయటం లాంటిది" అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.