
- ఈ ఫ్లడ్ సీజన్‌లో గోదావరి నుంచి 979.57 టీఎంసీలు
- కృష్ణా నుంచి 220.85 టీఎంసీలు
- రెండు నదులపై ప్రాజెక్టుల్లో 688 టీఎంసీల నిల్వ
హైదరాబాద్, వెలుగు: ఈ ఫ్లడ్ సీజన్‌లో గోదావరి, కృష్ణా నదుల నుంచి1,018 టీఎంసీలు నీళ్లు బంగాళాఖాతంలో కలిసాయి. గోదావరి నుంచి 797.57 టీఎంసీలు, కృష్ణా నుంచి 220.85 టీఎంసీలు సంముద్రంలో చేరాయి. 2 నదులపై మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఏపీలో నిర్మించిన ప్రాజెక్టుల్లో సోమవారం ఉదయానికి 688 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. Aరెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతుండగా, కృష్ణా బేసిన్‌లోని జూరాల, శ్రీశైలానికి వరద ప్రవాహం పెరిగింది. మరికొన్ని రోజులు వర్షాలు కురిసే చాన్స్ ఉండటంతో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల గేట్లు తెరిచే అవకాశముంది. జూరాల గేట్లు సోమవారమే ఓపెన్ చేశారు. గోదావరి బేసిన్‌లో సింగూరు, ఎస్సారెస్పీ, మిడ్ మానేరు, లోయర్ మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని వదిలేస్తున్నారు. నిరుటితో పోల్చితే ఈ ఏడాది గోదావరిలో ప్రవాహం తక్కువే ఉంది. నిరుడు ఇదే రోజు వరకు గోదావరి నుంచి 2,244 టీఎంసీల నీళ్లు బంగాళాఖాతానికి చేరాయి. కృష్ణా నది నుంచి 153.20 టీఎంసీలు సముద్రంలో కలిసాయి. కిందటేడాది ఇదే రోజున అన్ని రిజర్వాయర్లలో కలిపి 720.69 టీఎంసీలు నిల్వ ఉండగా, ఈసారి అంతకన్నా 32.87 టీఎంసీల నీళ్లు తక్కువగా నిల్వ ఉన్నాయి. ఈ ఫ్లడ్ సీజన్‌లో అత్యధికంగా శ్రీశైలానికి 640, జూరాలకు 568, ఆల్మట్టికి 574 టీఎంసీల వరద వచ్చింది. గోదావరి బేసిన్‌లో ఎల్లంపల్లికి 265, ఎస్సారెస్పీకి 174, ఎల్‌ఎండీకి 58 టీఎంసీల వరద వచ్చింది.