
భైంసా/ హైదరాబాద్, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు, మందులు అందించిన‘104’ సేవలకు సర్కారు మంగళం పలికింది. ఆ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయడంతోపాటు.. వాహనాలను అర్రాస్పెట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది. ‘104’ సర్వీస్‌లో ఉన్న198 వాహనాలన్నింటినీ వేలం వేసి అమ్మేయాలని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ నుంచి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. ఏ జిల్లాలోని వాహనాలను ఆ జిల్లాలోని కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ అమ్మనుంది.
15 ఏండ్ల సేవలకు బ్రేక్
104 వాహనాలు గ్రామీణ ప్రాంతాల్లో 15 ఏండ్ల నుంచి వైద్య సేవలు అందిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రోగుల ఇంటి వద్దకే వెళ్లి మందులు అందజేసేందుకు, టెస్టుల శాంపిల్స్ కలెక్ట్ చేసేందుకు, వ్యాధుల మీద అవగాహన కల్పించేందుకు‘104’ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఫార్మాసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు ఈ వాహనాల్లో గ్రామాల్లోకి వెళ్లి బీపీ, షుగర్ రోగులకు నెల నెలా టెస్టులు చేసి, ఉచితంగా మందులు అందించేవారు. సీజనల్ వ్యాధులు ప్రబలే సమయంలో ఊళ్లలోకి వెళ్లి క్యాంపులు పెట్టి, అక్కడికక్కడే రక్త పరీక్షలు చేసేవారు. నాన్ కమ్యునికెబుల్ డిసీజెస్‌తో బాధపడుతున్న రోగుల గుర్తింపు, మందుల అందజేతకు 2017లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా స్ర్కీనింగ్ ప్రారంభించింది. ఇందులో భాగంగా సబ్ సెంటర్లను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది. రోగులకు ఆశలు, ఏఎన్‌ఎంల ద్వారా సేవలు అందించడం ప్రారంభమైంది. మందులు కూడా వీరి ద్వారానే అందిస్తున్నారు. దీంతో క్రమేణా 104 సేవల అవసరం తగ్గిపోయింది. కరోనాకు ముందు నుంచే104 వ్యవస్థను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. కరోనాతో ఆ నిర్ణయం అమలు వాయిదా పడింది. తాజాగా, అన్ని వాహనాలను అమ్మేయాలని సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.
ఉద్యోగుల సర్దుబాటు
104 సర్వీసులో సుమారు 1375 మంది పనిచేస్తున్నారు. ఇందులో పైలట్లు( డ్రైవర్లు), ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉన్నారు. ఇప్పుడు వారిని పీహెచ్‌సీలు, డీఎంహెచ్‌వో ఆఫీసుల్లో సర్దుబాటు చేశారు.
కలెక్టర్లకు బాధ్యతలు
104 అంబులెన్స్ సేవలు ఇక నుంచి నిలిచిపోనున్నాయి. ఈ వాహనాలకు ప్రభుత్వం వేలం పాట నిర్వహించనుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు బాధ్యతలిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయి. త్వరలోనే వేలం పాట జరగనుంది.
- ధనరాజ్, డీఎంహెచ్‌వో, నిర్మల్