కాలేయ వ్యాధితో బాధ పడుతున్న 11 నెలల చిన్నారి

కాలేయ వ్యాధితో బాధ పడుతున్న 11 నెలల చిన్నారి
  •     అవయవదానానికి తల్లి సిద్ధం
  •     సహకరించని ఆర్థిక పరిస్థితులు
  •     దాతలు ఆదుకోవాలని వేడుకోలు

సత్తుపల్లి, వెలుగు: పుట్టుకతోనే ఆ చిన్నారి అనారోగ్యంతో బాధ పడుతోంది. రెండు నెలల వయస్సులో పాపకు చేయించిన సర్జరీ ఫెయిలైంది. ప్రస్తుతం పాపకు 11 నెలలు. నొప్పి భరించలేక రోజంతా పాప ఏడుస్తుండడంతో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం ఎన్టీఆర్ నగర్ కు చెందిన రేపాని పూర్ణచంద్రరావు, లక్ష్మి తిరుపతమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. ఇంటర్నెట్ సెంటర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. రెండో కూతురు కుందనిక కామెర్లతో జన్మించింది. కాలేయ సంబంధిత వ్యాధితో బాధ పడుతోంది. పాపకు రెండు నెలల వయస్సు ఉన్నపుడు రూ. 5 లక్షల వ్యయంతో సర్జరీ చేయించగా ఫెయిలైంది. కామెర్ల వ్యాధితోపాటు కడుపు ఉబ్బుతుండటంతో పాప తల్లడిల్లిపోతూ నిత్యం ఏడుస్తోంది.

హైదరాబాద్​లోని ప్రైవేట్​హాస్పిటల్​లో చూపించగా లివర్ మార్పిడి ఒక్కటే మార్గమని చెప్పారు. తల్లి లివర్ దానం చేసేందుకు రెడీగా ఉన్నప్పటికీ రూ.22 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు. ఇంటర్నెట్ సెంటర్ పై ఆధారపడి జీవించే తండ్రి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. ఖరీదైన వైద్యాన్ని అందుకోలేక.. పాప పడుతున్న బాధను చూడలేక ఆ కుటుంబం మానసిక క్షోభ అనుభవిస్తూ దాతల సహకారం కోసం ఎదురు చూస్తోంది.  దాతలు స్పందించి పాప ప్రాణాలు కాపాడాలని, రేపాని పూర్ణ చంద్రరావు బ్యాంక్ అకౌంట్ నంబర్ 910010003146472, ఐఎఫ్ఎస్ సీ కోడ్ యుటీఐబీ0000068 యాక్సిస్ బ్యాంక్ ఖాతాలో లేదా 9701123073 యూపీఐ నంబర్ కు విరాళాలు పంపాలని కోరుతున్నారు.