మాల్ ప్రాక్టీస్..​11 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది అరెస్ట్

మాల్ ప్రాక్టీస్..​11 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది అరెస్ట్

హసన్ పర్తి, వెలుగు : కేయూ ఎగ్జామినేషన్ బ్రాంచ్ లో  వారం కిందట జరిగిన మాల్ ప్రాక్టీస్ కేసులో  11 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ సంజీవ్ తెలిపారు. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్​లో సోమవారం కేసు వివరాలను ఆయన వెల్లడించారు. ‘‘కేయూ ఎగ్జామినేషన్ బ్రాంచ్​లో  కొన్నేళ్లుగా ఔట్ సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. డిగ్రీ విద్యార్థులు పరీక్ష రాసిన తర్వాత జవాబు పత్రాలను అక్కడే భద్రపర్చి సీల్​ వేస్తారు. ఫెయిల్ అవుతామనే ఆలోచనలో ఉన్న కొందరు విద్యార్థులకు జవాబు పత్రాలను బయటకు తీసి సిబ్బంది అందించేవారు.

జవాబులు రాసిన తర్వాత యథాతథంగా పెట్టేవారు. ఇందుకోసం డబ్బులు తీసుకునేవారు. ఈ తతంగం కొన్నేళ్లుగా జరుగుతోంది. మే 23న  అందులో పనిచేస్తున్న మాదాసి సునీల్, గడ్డం రాణా ప్రతాప్, నాసం శ్రీధర్ జవాబు పత్రాలు తీస్తుండగా, సీసీ ఫుటేజ్​లో రికార్డు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కాకతీయ యూనివర్సిటీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. ఈ ప్రక్రియలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు గుర్తించాం.

కేసుతో సంబంధం ఉన్న 11 మంది ఔట్ సోర్సింగ్ , దినసరి కూలీలను సోమవారం అరెస్టు చేసి రిమాండ్​కు తరలించాం. యూనివర్సిటీ ఉద్యోగుల పాత్ర పైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని, త్వరలోనే మిగతా వ్యక్తులను అరెస్టు చేస్తాం”అని సీఐ వెల్లడించారు.