
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో పాక్ ఆర్మీ, నిషేధిత తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) గ్రూపు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 19 మంది టీటీపీ ఉగ్రవాదులు, 11 మంది సైనికులు మరణించినట్లు పాక్ ఆర్మీ వెల్లడించింది. కాగా, అక్టోబర్ 7-8వ తేదీ రాత్రి పాక్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని ఒరాక్జాయ్ జిల్లాలో టీటీపీ ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు పాక్ ఆర్మీకి ఇంటలిజెన్స్ సమాచారం వచ్చింది.
వెంటనే పాకిస్తాన్ సైన్యం టెర్రరిస్టుల ఏరివేత ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో సైనికుల రాకను గమనించిన టెర్రరిస్టులు సైన్యంపై కాల్పులతో విరుచుకుపడ్డారు. వెంటనే అప్రమత్తమైన సైన్యం తిరిగి కాల్పులు జరిపింది. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 19 మంది ఉగ్రవాదులు హతమయ్యారని, లెఫ్టినెంట్ కల్నల్, మేజర్ సహా 11 మంది పాకిస్తాన్ సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారని పాక్ ఆర్మీ వెల్లడించింది.
ఉగ్రవాదుల ఏరివేత కోసం ఘటన స్థలంలో ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. కాగా, ఇటీవల పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ ప్రావిన్స్‌లలో తీవ్రవాద దాడులు పెరిగాయి. భద్రతా దళాలు, పోలీసులే లక్ష్యంగా ఉగ్రవాదులు విరుచుకుపడుతున్నారు. గడిచిన మూడు నాలుగు నెలల్లోనే వందల సంఖ్యలో పాక్ సైనికులు మరణించారు.