రెగ్యులరైజేషన్ కోసం కాంట్రాక్టు ఉద్యోగుల ఎదురుచూపులు

రెగ్యులరైజేషన్ కోసం  కాంట్రాక్టు ఉద్యోగుల ఎదురుచూపులు

హైదరాబాద్, వెలుగు: కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే ప్రక్రియను రాష్ట్ర సర్కార్ నాన్చుతున్నది. హైకోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చినా.. అసెంబ్లీలో సీఎం ప్రకటన చేసినా.. డిపార్ట్‌‌మెంట్ల నుంచి వివరాలు పంపినా రెగ్యులరైజేషన్ జీవోలు మాత్రం ఇవ్వడం లేదు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తే ఫుల్ జీతాలు చెల్లించాల్సి వస్తుందని వాయిదా వేస్తున్నది. ఇప్పటికే ఖజానా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో సర్కారు వెనకడుగు వేస్తున్నదని అధికారులు చెబుతున్నారు.

కేవలం పదుల సంఖ్యలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్న పంచాయతీరాజ్, ఇతర డిపార్ట్​మెంట్లలో రెగ్యులరైజేషన్ జీవోలను మాత్రమే సర్కారు ఇచ్చింది. కానీ ఇలాంటి వారు వేల సంఖ్యలో ఉన్న మెడికల్ అండ్ హెల్త్, ఎడ్యుకేషన్ డిపార్ట్‌‌మెంట్ల విషయంలో ఆపుతున్నది. ఇప్పటికే అనుకున్న లెక్కల ప్రకారం రెగ్యులరైజ్ చేస్తే నెలకు దాదాపు రూ.380 కోట్ల మేర అదనంగా జీతాలు చెల్లించాల్సి వస్తుందని అంచనా వేసింది. దీన్ని తప్పించుకుని ఏడాదిలో దాదాపు 4 వేల కోట్లకు పైగా మిగుల్చుకునేందుకే రాష్ట్ర సర్కార్ రెగ్యులరైజేషన్ జీవోలు ఇవ్వట్లేదని తెలిసింది. గత ఏడాది మార్చిలో 11 వేల మంది కాంట్రాక్టు ఎంప్లాయీస్​ను రెగ్యులర్‌‌‌‌గా మారుస్తామని సీఎం ప్రకటించారు. అయితే వివరాలు సేకరించే క్రమంలో ఈ సంఖ్య మరింత పెరిగింది. దీంతో కొందరిని రిగ్యులరైజ్ చేసి.. మరికొంత మందిని చేయకుంటే వారు ఆందోళన చేసే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవడం లేదని కాంట్రాక్టు ఉద్యోగుల్లో చర్చ జరుగుతున్నది. కాంట్రాక్టు ఉద్యోగులుగా ఉన్న వాళ్లలో చాలా మందికి బేసిక్ పే కూడా అందడం లేదు. ఇప్పటి దాకా కాంట్రాక్టు నుంచి రెగ్యులరైన ఉద్యోగుల సంఖ్య 500 లోపే ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు.

2 డిపార్ట్‌‌మెంట్లలోనే 8 వేల మంది

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి రెగ్యులర్ చేస్తామన్న కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఎడ్యుకేషన్, హెల్త్ డిపార్ట్‌‌మెంట్లలోనే ఎక్కువ మంది ఉన్నారు. ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు అందరినీ కలిపితే దాదాపు 5 వేల మంది ఉంటారని ఆఫీసర్లు చెప్తున్నారు. రెగ్యులర్ కావాల్సిన నర్సుల సంఖ్య 3 వేల పైనే ఉంటుందని తెలిసింది. ఈ రెండు డిపార్ట్‌‌మెంట్లలోనే 8 వేల పైచిలుకు కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. అనుకున్న దానికన్నా ఎక్కువ మందే ఉండటంతో ఆ సంఖ్యను తగ్గించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని, ఆ మేరకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. అన్ని అర్హతలున్నా అదనపు క్వాలిఫికేషన్స్​ పేరుతో పీహెచ్‌‌డీ, నెట్‌‌, సెట్ లాంటి వాటిని చేర్చి డిగ్రీ కాలేజీల్లో కొందరు కాంట్రాక్టు లెక్చరర్ల పేర్లను తొలగించారు. వాస్తవానికి ఒకవేళ ఏదైనా క్వాలిఫికేషన్ అవసరమైతే.. అందుకు కొంత సమయం ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు అలా కాకుండా రెగ్యులరైజేషన్ సంఖ్యను తగ్గించి జీతాల భారం తగ్గించుకునేందుకు ఇలా చేస్తున్నారని సమాచారం.