కోదాడలో గంజాయి బస్తాల కలకలం

కోదాడలో గంజాయి బస్తాల కలకలం

కోదాడ,వెలుగు: సూర్యాపేట జిల్లా కోదాడ టౌన్ లో గంజాయి బ్యాగులు కలకలం రేపాయి. కోదాడ టౌన్ లోని హుజూర్ నగర్ రోడ్ ఫ్లై ఓవర్ సమీపంలో ఓ షెడ్ లో 110 కేజీల గంజాయిని బస్తాల్లో వదిలివెళ్లారు. మంగళవారం ఉదయం 6 గంటలకు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బస్తాలతో బై పాస్ రోడ్ పై నుంచి వెళ్తుండగా స్థానికులు చూశారు. దీంతో వారు హడావిడిగా షెడ్ లోకి వెళ్లి అక్కడ బస్తాలను వదిలేసి పారిపోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 

కోదాడ టౌన్ పోలీసులు వెళ్లి బస్తాల్లోని గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఆ బస్తాలను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేపట్టారు. గంజాయిని అక్రమంగా తరలిస్తున్నవారు తనిఖీల భయంతో షెడ్ లో వదిలివెళ్లి ఉంటారని పోలీసులు అనుమానించారు.