
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగి దాదాపు నెలన్నర గడిచిపోయిన ఈ ఘటనను ఇంకా పూర్తిగా మర్చిపోలేకపోతున్నారు ప్రజలు. దాదాపు 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన ఈ విషాద ఘటన గురించి రోజు ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే అహ్మదాబాద్ ప్రమాదానికి సంబంధించిన మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంతో ఎయిరిండియా పైలట్లు భయాందోళనకు గురయ్యారు.
ఒకేసారి 260 మంది చనిపోవడంతో విధులకు వెళ్లాలంటేనే వణికిపోయారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిన తర్వాత గంటల వ్యవధిలోనే ఏకంగా 112 మంది పైలట్లు సిక్ లీవులకు అప్లై చేయడమే ఇందుకు నిదర్శనం. ఈ విషయాన్ని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో భాగంగా గురువారం (జూలై 24) లోక్ సభలో అహ్మదాబాద్ విమాన ప్రమాదం గురించి మాట్లాడుతూ.. అహ్మదాబాద్లో ఎయిరిండియా బోయింగ్ విమానం కుప్పుకూలిన తర్వాత ఎయిర్ ఇండియా పైలట్లు ఆందోళనకు గురయ్యారని తెలిపారు.
ALSO READ | ఎయిర్ ఇండియా ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు బ్రిటన్ పౌరుల మృతదేహాలు తారుమారు..
ఈ దుర్ఘటన జరిగిన వెంటనే 112 మంది పైలట్లు నాలుగు రోజుల పాటు సిక్ లీవులు అప్లై చేసుకుని వెళ్లిపోయారని చెప్పారు. 61 మంది ఫ్లైట్ కమాండర్లు, 51 మంది ఫ్లైట్ ఆఫీసర్లు సెలవులు పెట్టారని తెలిపారు. ఇంత భయంకరమైన ప్రమాదం జరగడంతో పైలట్లు కొంత మానసిక ఒత్తిడికి గురయ్యారన్నారు. ఈ ప్రమాదం తర్వాత సహాయక బృందాలను ఏర్పాటు చేయాలని విమానయాన సంస్థలకు సూచించామని చెప్పారు రామ్మోహన్ నాయుడు.
కాగా, 2025, జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా డ్రీమ్ లైనర్ బోయింగ్ విమానం టేకాఫ్ అయిన క్షణాల్లోనే కుప్పకూలిన విషయం తెలిసిందే. ఎయిర్ పోర్టు సమీపంలోని ఓ మెడికల్ కాలేజ్ భవనంపై ఫ్లయిట్ క్రాష్ అయ్యింది. ప్రమాద సమయంలో విమానంలో సిబ్బంది, ప్రయాణికులు మొత్తం కలిపి 242 మంది ఉండగా.. ఇందులో ఒక్కరూ మినహా మిగిలిన అందరూ సజీవ దహనమయ్యారు.
ఇక, ఫ్లైట్ కాలేజ్ బిల్డింగ్పై క్రాష్ కావడంతో అందులోని దాదాపు 25 మంది వైద్యులు, మెడికల్ సిబ్బంది చనిపోయారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన ఏఏఐబీ.. విమానంలోని ఫ్యూయల్ స్విచుల్లో అనూహ్య మార్పులే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించింది.