పిక్నిక్‌‌‌‌కు వెళ్తుండగా ప్రమాదం..12 మంది మృతి

పిక్నిక్‌‌‌‌కు వెళ్తుండగా ప్రమాదం..12 మంది మృతి
  •     అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో బస్సు, ట్రక్కు ఢీ
  •     రాంగ్ రూట్లో ట్రక్కు రావడం, పొగమంచు ఉండటంతో ప్రమాదం

గోలాఘాట్/జోర్‌‌‌‌‌‌‌‌హాట్ (అస్సాం) : అస్సాంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కు, బస్సు ఢీకొనడంతో 12 మందికి పైగా చనిపోయారు. మరో 38 మంది గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ‘‘గోలాఘాట్ జిల్లాలోని బలిజన్ వద్ద నేషనల్ హైవే 715పై 49 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. బొగ్గు లోడుతో వెళ్తున్న ట్రక్కును తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఢీకొట్టింది. ఈ ఘటనలో చనిపోయిన వారందరూ బాసా భరాలువా గ్రామానికి చెందిన వారే. తిన్సుకియా జిల్లాలోని తిలింగ మందిర్‌‌‌‌‌‌‌‌కు పిక్నిక్ కోసం వీరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది” అని పోలీసు అధికారులు వెల్లడించారు. ‘‘ఫోర్‌‌‌‌‌‌‌‌ లైన్ హైవే డ్యామేజ్ కావడంతో ట్రక్కు రాంగ్ రూట్‌‌‌‌లో వచ్చింది. బస్సు రైట్ రూట్‌‌‌‌లోనే వెళ్తున్నా.. దట్టంగా మంచు కమ్మేయడం, రెండు వాహనాలు వేగంగా వెళ్తుండటంతో ప్రమాదం జరిగింది’’ అని వివరించారు.

31 మంది జోర్‌‌‌‌‌‌‌‌హాట్ ఆసుపత్రిలో, స్వల్పంగా గాయపడిన మరో ఏడుగురు డెర్గావ్‌‌‌‌ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌‌‌‌‌‌‌‌లో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంపై మెజిస్టీరియల్ ఎంక్వైరీ మొదలైనట్లు గోలాఘాట్ జిల్లా కమిషనర్ ఉదయ్ ప్రవీణ్ తెలిపారు. ఇద్దరు డ్రైవర్లు చనిపోయారని, ప్రమాదానికి కారణాలేంటనేది దర్యాప్తులో తెలుస్తుందని తెలిపారు. ‘‘ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను బయటికి తీసుకొచ్చారు. వారిని అంబులెన్సుల్లో ఆసుపత్రులకు తరలించారు” అని జిల్లా ఎస్పీ రాజేన్ సింగ్ చెప్పారు. ఈ ఘటనలో 12 మంది మృతి చెందడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తదితరులు సంతాపం తెలిపారు. గాయపడిన వాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఎక్స్‌‌‌‌గ్రేషియాను ప్రధాని ప్రకటించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు మంత్రి పరిమళ్ శుక్లబైద్య వెల్లడించారు.