
ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దు గొడవలు తారా స్థాయికి చేరాయి. ఈ రెండు దేశాల సరిహద్దు సైనికుల మధ్య జరిగిన కాల్పుల్లో 12 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. డ్యూరాండ్ లైన్ వెంబడి ఈ కాల్పులు జరిగాయి. కునార్, హెల్మండ్ ప్రావిన్సులలో డ్యూరాండ్ లైన్ వెంబడి పాకిస్తాన్ సైన్యం నుంచి తాలిబన్ దళాలు అనేక అవుట్‌పోస్టులను స్వాధీనం చేసుకున్నాయని ఆఫ్ఘన్ రక్షణ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో ఇటీవల పాకిస్తాన్ సైనిక చర్యలకు కౌంటర్గా ఆఫ్ఘన్ దళాలు ఈ కాల్పులు జరిపాయి. తాలిబాన్లతో జరిగిన ఎదురుకాల్పుల్లో 11 మంది పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అఫ్గాన్ బార్డర్‌లో ఉన్న ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో టెర్రరిస్టులు దాగి ఉన్నట్లు వచ్చిన సమాచారంతో జవాన్లు సెర్చింగ్ ప్రారంభించారు.
ఈ ఆపరేషన్ సందర్భంగా జరిగిన కాల్పుల్లో 39 ఏండ్ల లెఫ్టినెంట్ కల్నల్ జునైద్, 33 ఏండ్ల మేజర్ తయ్యబ్‌రహత్‌తో సహా మొత్తం 11 మంది జవాన్లు మరణించారని పాక్ సైన్యం తెలిపింది. ఈ ఆపరేషన్‌లో ఫిట్నా అల్‌ఖవారీజ్‌కు చెందిన 19 మంది టెర్రరిస్టులను కూడా పాక్ సైన్యం మట్టుబెట్టిందని చెప్పింది. కాగా, తెహ్రీక్ ఎ తాలిబాన్ టెర్రరిస్ట్ గ్రూప్‌ను ఫిట్నా అల్‌జవారీస్‌గా పాకిస్తాన్ ప్రభుత్వం కిందటేడాది ప్రకటించింది. సైనికుల మరణాలపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేశారు.