- రెండుచోట్ల జరిగిన ఎన్ కౌంటర్లలో ఆరుగురు సైనికులు మృతి
పెషావర్: పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో భారీ ఎన్ కౌంటర్లు చోటుచేసుకున్నాయి. రెండు చోట్ల జరిగిన ఎదురుకాల్పుల్లో మొత్తం 12 మంది టెర్రరిస్టులను సైన్యం, పోలీసులు మట్టుబెట్టారు. ఈ ఘటనలలో ఆరుగురు సైనికులు కూడా చనిపోయారు. గురు, శుక్ర వారాల్లో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఉత్తర, దక్షిణ వజీరిస్తాన్ జిల్లాల్లో ఈ ఎన్ కౌంటర్లు జరిగాయని ఆర్మీ మీడియా విభాగం తెలిపింది. తెహ్రీక్- ఈ -తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) ఈ దాడులు చేసినట్టు తెలిపింది.
గురువారం నార్త్ వజీరిస్తాన్ జిల్లాలోని స్పిన్ వామ్లో ఏడుగురు మిలిటెంట్ల బృందం అఫ్గాన్ నుంచి పాక్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించింది. భద్రతా బలగాలు గుర్తించి అడ్డుకునే ప్రయత్నం చేయగా.. మిలిటెంట్లు కాల్పులు జరిపారు. బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు టెర్రరిస్టులు హతమయ్యారు.
లాధాలో చెక్ పోస్ట్‌పై దాడి..
దక్షిణ వజీరిస్తాన్ జిల్లాలోని లాధా తహసీల్ లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. మిష్టా గ్రామంలోని సెక్యూరిటీ చెక్ పోస్ట్‌పై మిలిటెంట్ల బృందం దాడి చేసింది. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు టెర్రరిస్టులు, ఆరుగురు సైనికులు చనిపోయారు.