V6 News

12వ శతాబ్దపు ఆధునిక తత్వవేత్త బసవేశ్వరుడు

12వ శతాబ్దపు ఆధునిక తత్వవేత్త బసవేశ్వరుడు

బసవన్న తన హృద్యమైన కవిత్వం అంటే అందరూ గౌరవించే వచనల ద్వారా కుల వివక్ష, మూఢనమ్మకాలను వ్యతిరేకిస్తూ సమానత్వ సందేశాలను వ్యాప్తిచేశారు. 12 వ శతాబ్దంలో కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఉన్న చారిత్రాత్మక నగరం బసవకల్యాణ్​లో అనుభవ మండపాన్ని (మహామానే) స్థాపించారు. అది ఆధ్యాత్మిక, మేధోపరమైన ప్రజాస్వామ్య వేదికగా మారింది. అనుభవ మండపం ప్రపంచంలోనే మొట్టమొదటి మత పార్లమెంటుగా గుర్తింపు పొందింది. ఇక్కడ లింగాయత మతానికి చెందిన యోగులు, సాధువులు, తత్వవేత్తలు సమావేశమై చర్చించి, తమ ఆలోచనలను పంచుకునేవాళ్లు.

బసవేశ్వర స్వామి సుమారు క్రీ.శ. 1131వ సంవత్సరంలో ఇంగలేశ్వర బాగేవాడి (ప్రస్తుతం కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలో ఉంది)లోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి మదిరాజ లేదా మదరస. బాగేవాడి అగ్రహారానికి అధిపతి. తల్లి మదలంబిక. ఒక ధార్మికురాలు. బాగేవాడి ప్రధాన దైవమైన నందీశ్వరుని భక్తురాలు. బసవన్న వారి మూడో సంతానం. అతనికి దేవరాజు అనే అన్నయ్య, నాగమ్మ అనే అక్క ఉండేవాళ్లు. వాళ్లు బసవన్న తరువాత మత, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. స్థానిక శైవ సంప్రదాయంలో శివుని వాహనమైన నంది పేరు మీదుగా బసవన్నకు ఆ పేరు వచ్చింది. ఆయన పుట్టిన కొద్దికాలానికే కూడల సంగమం నుంచి జాతవేదముని అనే గొప్ప శైవ సాధువు వచ్చి, అతనికి ఒక ప్రతీకాత్మక లింగాన్ని ప్రసాదించారు.
చిన్నప్పటి నుంచే ఆయన కఠినమైన ఆచారాలు, మూఢనమ్మకాలను వ్యతిరేకించేవారు. తనకు ఉపనయనం చేయకూడదని ఎనిమిదేళ్ల వయసులోనే ఇంటిని వదిలి కూడల సంగమం వెళ్లిపోయారు. 

కృష్ణా నది, దాని ఉపనది అయిన మలప్రభా సంగమ స్థానంలో ఉన్న కూడల సంగమం, ఆ రోజుల్లో గొప్ప విద్యా కేంద్రాల్లో ఒకటి. అక్కడ ఈశాన్య గురువు ఆధ్వర్యంలో వేదాలు, ఉపనిషత్తులు, ఆగమాలు, పురాణాలు, కావ్యాలతో పాటు వివిధ మత విశ్వాసాలు, తత్వశాస్త్రాల వివరణలను విస్తృతంగా అధ్యయనం చేశారు. అక్కడే ఆయన ఎన్నో వచనాలు రాశారు. సుమారు పన్నెండు సంవత్సరాలు అక్కడే గడిపారు. 

అతని మేనమామ బలదేవుడు కలచూర్య వంశానికి చెందిన బిజ్జలుడి దగ్గర ఆర్థిక మంత్రిగా (భండారి) ఉండేవారు. ఆయన తన కూతురుని బసవన్నకు ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ, ఆధ్యాత్మిక సాధన అనే ఉన్నత ఆదర్శానికి అంకితమైన బసవ, ఆ ప్రతిపాదనను మొదట అంగీకరించలేదు. ఈశాన్య గురువు అతనికి నచ్చజెప్పారు. దాంతో బసవన్న సంగమాన్ని విడిచిపెట్టి తార్దావాడి రాజధాని మంగళవాడ (ఆధునిక మంగళవేదే, మహారాష్ట్రలోని పండరాపూర్ సమీపంలో ఉంది)కి బయలుదేరారు. అక్కడే బసవన్న బలదేవుని కుమార్తె గంగాంబికను, బిజ్జలుని దత్త సోదరి నీలంబికను వివాహం చేసుకున్నారు. అతను మంగళవాడలో కొన్ని సంవత్సరాలు ఉండి తన సామర్థ్యంతో అధికారాన్ని, ప్రాముఖ్యతను పొందాడు. బలదేవుని తరువాత ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి అర్హత సాధించాడు. 

కానీ.. ఆ సమయానికి కర్ణాటకలో రాజకీయ పరిస్థితి మారుతూ ఉంది. చాళుక్య సామ్రాజ్యానికి సామంతుడైన బిజ్జలుడు, చాళుక్య సింహాసనాన్ని ఆక్రమించి చక్రవర్తి అయ్యాడు. అతను బసవేశ్వరుడిని తనతో పాటు కల్యాణకు తీసుకెళ్లి మంత్రి పదవిని అప్పగించాడు. కల్యాణలో గడిపిన పన్నెండు లేదా పదమూడు సంవత్సరాల కాలంలో ఆయన సాధించిన విజయాలు అద్భుతమైనవి. ఎన్నో మత, సామాజిక కార్యకలాపాలు చేపట్టారు. వాటివల్ల ఆయన ఏర్పాటు చేసిన అనుభవ మంటపానికి దేశం నలుమూలల నుంచి వందలాది మంది సాధువులు, ఆధ్యాత్మిక వేత్తలు వచ్చారు. ప్రజా చైతన్యం అనే కీలకమైన కార్యంలో ధర్మం ఒక జీవశక్తిగా మారింది. మత చరిత్రలో మరెన్నడూ ధర్మం ఇంతటి వైభవాన్ని, ఇంతటి అద్భుత శక్తిని పొందలేదు. 

బసవన్న ఎనిమిది వందల సంవత్సరాల క్రితం జీవించినప్పటికీ ఆయన మనకు పూర్తిగా ఆధునికుడిగా కనిపిస్తారు. అందువల్ల ఆయన బోధనలు నేటికీ ప్రాసంగికంగా ఉన్నాయి. సమాజానికి ఆయన చేసిన అపారమైన సేవను దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటులో, లండన్‌లో బసవవేశ్వర స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలంగాణలో అప్పటి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్) ప్రభుత్వ హయాంలో ట్యాంక్ బండ్‌పై బసవన్న విగ్రహాన్ని ప్రతిష్ఠిచారు. అంతేకాకుండా హైదరాబాద్‌లోని కోకాపేట్‌లో బసవ భవన్ కోసం ఎకరం స్థలాన్ని, రూ. 10 కోట్లను మంజూరుచేశారు. బసవేశ్వరుడు తన జీవితంలో ఎక్కువ భాగం గడిపిన బసవకల్యాణలో నూతన అనుభవ మండప నిర్మాణానికి అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్. యడియూరప్ప శంకుస్థాపన చేశారు. 7.5 ఎకరాల విస్తీర్ణంలో రూ. 742 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ లక్ష్యం 12 వ శతాబ్దపు తత్వవేత్తల బోధనలను, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం, బసవన్న బోధనలను ప్రోత్సహించడమే. ఈ భవనం కల్యాణ చాళుక్య వాస్తుశిల్ప శైలిలో ఉంటుంది. 

బసవన్న (1131–1167) బసవేశ్వర ప్రభువుగా కూడా పేరుగాంచారు. శివకేంద్రిత భక్తి ఉద్యమంలో పూజ్య తత్వవేత్త, కవి, సంఘ సంస్కర్తగా గుర్తింపుపొందారు. కల్యాణి చాళుక్య, కలాచూరి రాజవంశాల పాలనలో ముఖ్యంగా కర్ణాటకలోని బిజ్జల రాజు ఆధ్వర్యంలో అతని ప్రభావం ఎక్కువగా ఉండేది. బసవన్న తన సాహిత్య కృషికి, శివభక్తికి చిహ్నంగా ఇష్టలింగాన్ని(లింగం పొదిగిన హారం) పరిచయం చేశారు. 


- సీ ఆర్ గౌరీశంకర్
సీనియర్ జర్నలిస్ట్

లైఫ్​& లిటరేచర్​ పేజీకి వ్యాసాలు పంపాల్సిన మెయిల్​ ఐడీ
featureseditor@v6velugu.com