పాస్ బుక్కులిస్తామని  పట్టాలు తీసుకెళ్లిన్రు..

పాస్ బుక్కులిస్తామని  పట్టాలు తీసుకెళ్లిన్రు..
  • పట్టాలిచ్చిన్రు..హద్దులు మరిచిన్రు..
  • దుబ్బాక మండలం ఆకారంలో ప్రధాని పంపిణీ చేసిన భూముల పరిస్థితి
  • పాస్ బుక్కులిస్తామని  పట్టాలు తీసుకెళ్లిన్రు..
  • 17 ఏండ్లుగా లబ్ధిదారుల ఎదురుచూపులు


సిద్దిపేట/దుబ్బాక, వెలుగు :  సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారం గ్రామరైతులకు 2005లో ప్రధాని చేతుల మీదుగా భూమి పట్టాలు అందాయి. కానీ నేటికీ రైతులకు ఈ భూమిలో అధికారులు హద్దులు చూపలేదు. పైగా ఇచ్చిన ఆరునెలలకే పాస్​ బుక్కులు ఇస్తామని పట్టాలు తీసుకెళ్లి ఇప్పటికీ ఇవ్వలేదు. దీంతో బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు. 

120 మందికి 113 ఎకరాలు.. 

భూ పంపిణీ కార్యక్రమంలో భాగంగా 2005 ఆగస్టులో  తొలి విడుతగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా ఆకారం గ్రామంలోని  పేద బీసీ, ఎస్టీ, ఎస్టీలకు భూ పంపిణీ చేశారు. గ్రామంలోని  120 మందికి  పది సర్వే నంబర్లలో 113 ఎకరాల ప్రభుత్వ  భూమిని కేటాయిస్తూ పట్టా సర్టిఫికెట్లు అందజేశారు. 

హద్దుల కేటాయింపులో డిలే.. 

భూ పట్టాలు పంపిణీ చేసి 17 ఏండ్లు గడుస్తున్నా ఇంకా హద్దులు చూపకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పట్టా సర్టిఫికెట్లలోనూ భూ సరిహద్దులను చూపకపోవడంతో తమ సమస్య పరిష్కరించాలని బాధితులు ఆఫీసర్ల చుట్టూ ఏండ్ల కొద్దీ తిరుగుతూనే ఉన్నారు. అధికారుల తీరుతో విసిగిపోయిన కొందరు లబ్ధిదారులు తమకు అనుకూలమైన స్థలంలో వ్యవసాయం చేసుకుంటున్నారు. 

ఇచ్చిన ఆర్నెళ్లకే పట్టాలు తీసుకెళ్లిన్రు.. 

పట్టాలు ఇచ్చిన వెంటనే భూమిలో హద్దులు చూపకపోగా పాస్​ బుక్కులు ఇస్తామని చెప్పి ఆర్నెళ్లకే అప్పటి గ్రామకార్యదర్శి లబ్ధిదారుల నుంచి పట్టా సర్టిఫికెట్లను తిరిగి తీసుకెళ్లారు. మొత్తం 120 మంది లబ్ధిదారుల్లో 90 మంది తమ పట్టా సర్టిఫికెట్లను గ్రామ కార్యదర్శికి అప్పగించారు. కానీ ఇప్పటికీ వారి పాస్​ బుక్కులు అందలేదు. ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించి తమకు పట్టా సర్టిఫికెట్లు, పాస్​ బుక్కులు ఇవ్వాలని కోరుతున్నారు. ఇదే విషయమై ఇటీవల సిద్దిపేట కలెక్టరేట్​లోని ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం అందజేయడంతో పాటు ఎమ్మెల్యే రఘునందన్ రావును కలసి తమ గోడు వెల్లబోసుకున్నారు. 

అంతకుముందే గిరిజనులకు..
2005లో ప్రధాని పట్టాలిచ్చిన భూమినే  1972లో శిలాజీ నగర్ కు చెందిన 20 గిరిజన కుటుంబాలకు అప్పటి ప్రభుత్వం పట్టాలను పంపిణీ చేసింది. వారు ఆ భూమిని కబ్జాలోకి తీసుకోకపోవడంతో  అదే స్థలాన్ని ఆకారం గ్రామంలోని 120 మంది పేదలకు పంచిపెట్టింది. అయితే ఆ భూములు తమకు కేటాయించారని ఇప్పుడు శిలాజీనగర్ గిరిజనులు సైతం అక్కడికి వస్తుండటంతో ఆకారం లబ్ధిదారులకు ఎటూ పాలుపోని పరిస్థితి ఏర్పడింది.

పాస్​బుక్కులు ఇయ్యలె.. 
మాకు భూముల పట్టాలు ఇచ్చినట్టే ఇచ్చి తిరిగి తీసుకెళ్లిన్రు.. ఏండ్లు గడుస్తున్నా పట్టాలు ఇవ్వట్లే.. పాస్​ బక్కులూ ఇస్తలేరు.. ఈ సమస్యతోనే మేం సతమతం అవుతుంటే ఇదే స్థలం మాకు ఇచ్చారని శిలాజీనగర్ గిరిజనులు వస్తున్రు.. సారోళ్లు జల్ది మా సమస్యను తీర్చాలె. ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- ఎం.రాజవ్వ,  లబ్ధిదారురాలు, ఆకారం

ఎవరూ పట్టించుకుంటలేరు..


ప్రధాని భూములిచ్చినప్పటి నుంచి వాటికి హద్దులు చూపాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నం. కానీ ఎవరూ పట్టించుకుంటలేరు. ఏండ్లు గడుస్తున్న కొద్దీ సమస్య పెద్దదవుతోంది. అధికారులు వెంటనే స్పందించాలె. మా భూములు మాకు అప్పగించాలె :  - ఎం.సుగుణ, లబ్ధిదారురాలు, ఆకారం

త్వరలో సమస్యకు పరిష్కారం


ఆకారం గ్రామంలో ప్రధాని పంపిణీ చేసిన భూముల సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుంది. ఈ విషయమై ఇప్పటికే రెవెన్యూ అధికారులకు సూచించాం. ఆర్డీవో స్థాయి అధికారితో ప్రత్యేకంగా పరిశీలిన జరిపి త్వరలోనే లబ్ధిదారులకు అందేలా చూస్తాం.  ఎం.రఘునందన్ రావు,  ఎమ్మెల్యే దుబ్బాక