మూడు రోజులపాటు నిర్వహణ

మూడు రోజులపాటు నిర్వహణ
  • నారెడ్కో ప్రాపర్టీ షో షురూ
  • మూడు రోజులపాటు నిర్వహణ
  • అందుబాటులో  300 లకుపైగా ప్రాపర్టీలు 

హైదరాబాద్, వెలుగు:   నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌‌మెంట్ కౌన్సిల్ (నారెడ్కో) తెలంగాణ 12వ ప్రాపర్టీ షో  హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌‌‌‌లో శుక్రవారం  ప్రారంభమైంది. కార్యక్రమంలో100 మందికిపైగా బిల్డర్లు, డెవలపర్లు, ఆర్థిక సంస్థలు, మెటీరియల్​ సప్లయర్లు పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరి బడ్జెట్‌‌కు అనువైన ప్రాపర్టీలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ  ప్రత్యేక కార్యదర్శి అరవింద్​ కుమార్​ ఈ షోను ప్రారంభించారు. కార్యక్రమం ఈ నెల 24 వరకు కొనసాగుతుంది. ఈ సందర్భంగా నారెడ్కో ప్రతినిధులు మాట్లాడుతూ ‘‘ఐటీ, ఐటీఈఎస్, ఫార్మా, ఏవియేషన్, ఆటోమొబైల్స్, ఇతర కీలక రంగాలకు ఊతమిచ్చేందుకు  తెలంగాణ  ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలు, విధానాలు హైదరాబాద్​ను సరికొత్తగా తీర్చిదిద్దుతున్నాయి.  హైదరాబాద్ అంతర్జాతీయ బహుళజాతి సంస్థలకు ఫేవరెట్​ సిటీగా మారింది. టెక్, ఉపాధి కల్పనకు సంబంధించి హైదరాబాద్​లో రోజురోజుకూ మరింత ముందుకుసాగుతోంది. 

రియల్ ఎస్టేట్‌‌లో బూమ్ హైదరాబాద్‌‌కు మాత్రమే పరిమితం కాదు. రాష్ట్రంలోని టైర్​ 2,3 పట్టణాల్లో వ్యాపిస్తోంది. జిల్లాల్లో పట్టణీకరణ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఫ్లాట్లు, ప్లాట్లలో ఇన్వెస్ట్ చేసేందుకు ఎంతో మంది కొనుగోలుదారులు ప్రాధాన్యం ఇస్తున్నారు” అని వివరించారు.  నారెడ్కో తెలంగాణ 12వ ప్రాపర్టీ షో అత్యుత్తమ రియల్ ఎస్టేట్ డెవలపర్లందరినీ ఒక్కచోటుకు చేర్చింది. 300 కు పైగా ప్రాపర్టీలలో తమకు అనువైన వాటిని ఎంచుకునే అవకాశాన్ని కొనుగోలుదారులకు కల్పిస్తోంది. డెవలపర్లు అందిస్తున్న వాటిలో అపార్ట్​మెంట్లు, విల్లాలు, ప్లాట్లు, వ్యవసాయ భూములు వంటివి ఉన్నాయి. ఎస్‌‌బీఐ, హెచ్​డీఎప్​సీ, ఐసీఐసీఐ బ్యాంక్, నవీ ఫిన్ సర్వ్, ఎల్ఐసీ, హెచ్ఎఫ్ఎల్, కెనరా బ్యాంక్ వంటి ప్రముఖ ఆర్థిక సంస్థలు ఈ ప్రదర్శనలో పాల్గొంటూ లోన్లను ఆఫర్​ చేస్తున్నాయి. 

ఈ సందర్భంగా నారెడ్కో తెలంగాణ ప్రెసిడెంట్ సునీల్ చంద్రారెడ్డి మాట్లాడుతూ, ‘‘నారెడ్కో రోజురోజుకూ విస్తరిస్తోంది.  రియల్ ఎస్టేట్ సెక్టార్‌‌‌‌  ప్రయోజనాల కోసం మాత్రమే కాకుండా రాష్ట్రాభివృద్ధి కోసం ప్రభుత్వంతో  కలసి పనిచేస్తున్నాం’’ అని అన్నారు. నారెడ్కో తెలంగాణ ప్రధాన కార్యదర్శి  విజయ సాయి మేకా మాట్లాడుతూ, ‘‘హైదరాబాద్ నగరం ఎంతగానో అభివృద్ధి చెందుతోంది. అది రియల్ ఎస్టేట్ రంగంపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తోంది.  మౌలిక వసతుల అభివృద్ధి, మెరుగుపర్చబడిన రోడ్డు కనెక్టివిటీ వల్ల నగరం చుట్టుపక్కల ఉండే సబ్–మార్కెట్లు బాగా మెరుగుపడ్డాయి”అని అన్నారు.