- జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు, 146 వార్డులు
- మొత్తం ఓటర్లు 4,92,920 మంది
- మహిళలు 2,55,656 మంది, పురుషులు 2,37,219 మంది, ఇతరులు 45
నిజామాబాద్, వెలుగు : మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇటీవల ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయగా, ఈ నెల 10న తుది ఓటరు జాబితాను రిలీజ్ చేయనుంది. దీంతో నిజామాబాద్ జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంటోంది.
గడిచిన పంచాయతీ ఎన్నికల మాదిరిగా పురపాలక ఎన్నికల్లోనూ మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. పురుషులకంటే అధికంగా ఉండడంతో ఆయా పార్టీల నేతలు మహిళా ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారించారు. రిజర్వేషన్ అమలుతో పాటు మహిళలు మున్సిపాలిటీల్లోనూ పదవులను దక్కించుకోనున్నారు.
నాలుగు మున్సిపాలిటీల్లో మహిళలు ఆధిక్యం
జిల్లాలోని నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల్లో కలిపి 4,92,920 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 2,55,656 మంది, పురుషులు 2,37,219 మంది, ఇతరులు 45 మంది ఉన్నారు. 146 వార్డులు, డివిజన్లకు ప్రతినిధులను ఎన్నుకోవడంలో మహిళా ఓటర్లే నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నారు. గత నెల మూడు విడతల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మహిళలే నిర్ణేతలుగా నిలిచారు. జిల్లాలోని 545 గ్రామ పంచాయతీల పరిధిలో 8,51,417 మంది ఓటర్లు ఉండగా, ఇందులో మహిళలు 4,54,621, పురుషులు 3,96,778, ఇతరులు 18 మంది ఉన్నారు.
మహిళలు 84 శాతం పోలింగ్ నమోదు చేసి సత్తా చాటగా, పురుషుల పోలింగ్ 68 శాతానికే పరిమితమైంది. రిజర్వేషన్ల ప్రభావంతో 244 మంది మహిళలు సర్పంచ్‌లుగా గెలుపొందారు. ఇదే ధోరణి కొనసాగితే రాబోయే మున్సిపల్, నగర పాలక ఎన్నికల్లోనూ సుమారు 60 మంది మహిళలు కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా పాలనలో భాగం కానున్నారు.
మహిళా ఓటర్లే పార్టీల ప్రధాన లక్ష్యం..
ప్రధాన రాజకీయ పార్టీలు మహిళల మద్దతు కోసం వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఫ్రీ బస్ ప్రయాణం, రూ.500కే వంట గ్యాస్, ఇందిరమ్మ ఇండ్లు, మహిళా శక్తి క్యాంటీన్లు, మీసేవా కేంద్రాలు, సోలార్ పవర్ ప్లాంట్ల కేటాయింపుల వంటి పథకాలు మహిళలను ఆకట్టుకున్నాయి. మహిళా సంఘాల ద్వారా బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీలో అద్దెకు నడిపించే విధానం, పొదుపు సంఘాలకు రుణాల మంజూరు, జీరో వడ్డీ రుణాలు, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ మహిళల్లో విశేష ఆదరణ పొందాయి.
ఈ కారణంగా మహిళల మద్దతు తమకే ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. మరోవైపు ఇతర పార్టీలు మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు కుక్కర్లు, మిక్సీలు తదితర ఇంటి సామగ్రి పంపిణీకి
సిద్ధమవుతున్నాయి.
మున్సిపాలిటీ డివిజన్/ మహిళా పురుష ఇతరులు మొత్తం
వార్డులు ఓటర్లు ఓటర్లు
నిజామాబాద్ 60 1,78,797 1,65,916 43 3,44,756
బోధన్ 38 35,929 33,881 - 69,810
ఆర్మూర్ 36 33,428 30,735 02 64,165
భీంగల్ 12 7,502 6687 - 14,189
