ఢిల్లీలో13 మంది ఆప్ కౌన్సిలర్లు రిజైన్.. 'ఇంద్రప్రస్థ వికాస్' పేరిట కొత్త పార్టీ ఏర్పాటు ప్రకటన

ఢిల్లీలో13 మంది ఆప్ కౌన్సిలర్లు రిజైన్.. 'ఇంద్రప్రస్థ వికాస్' పేరిట కొత్త పార్టీ ఏర్పాటు ప్రకటన

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్ )కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన 13 మంది కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. అంతేగాక, కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. శనివారం  మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ(ఎంసీడీ)లో ఆప్ సభా నాయకుడిగా ఉన్న ముఖేశ్ గోయల్ నాయకత్వంలో  కౌన్సిలర్లు 'ఇంద్రప్రస్థ వికాస్' పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు. 

ఈ రాజీనామాలతో ఎంసీడీలోని ఆప్ కౌన్సిలర్ల సంఖ్య 113 నుంచి 100కి పడిపోయింది. బీజేపీ 117, కాంగ్రెస్ 8 స్థానాలతో ఉన్నాయి. ఈ తిరుగుబాటు బృందానికి ముకేశ్ గోయల్ నాయకత్వం వహిస్తున్నప్పటికీ, హేమ్‌‌‌‌‌‌‌‌చంద్ గోయల్ కొత్త పార్టీకి నాయకుడిగా వ్యవహరిస్తారు.

రాజీనామాకు కారణాలివే..  

కౌన్సిలర్లు తమ రాజీనామాకు గల కారణాలను వివరిస్తూ.. “రెండేండ్లుగా ప్రజలకు సేవలు అందించలేకపోయాం. హౌస్‌‌‌‌‌‌‌‌లో ఆటంకాల కారణంగా సజావుగా పనిచేయలేకపోయాం. 2022లో ఎంసీడీలో అధికారంలోకి వచ్చినప్పటికీ పార్టీ నాయకత్వం సమర్థవంతంగా ఎంసీడీని నడపలేకపోయింది. నాయకత్వంతో కౌన్సిలర్ల మధ్య సమన్వయం లోపించింది. దాంతో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయాం. అందుకే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రిజైన్ చేస్తున్నాం” అని పేర్కొన్నారు. 

ఇదంతా బీజేపీ ఆపరేషనే: ఆప్   

ఈ రాజీనామాలపై ఆప్ తీవ్రంగా స్పందించింది. “మేయర్ ఎన్నికల తర్వాతి నుంచి బీజేపీ మా కౌన్సిలర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. ఆప్ కు చెందిన ప్రతి కౌన్సిలర్‌‌‌‌‌‌‌‌కు రూ. 5 కోట్లు ఆఫర్ చేశారు. ఇదంతా బీజేపీ  ఆపరేషనే” అని ఆప్ ఆరోపించింది.