
పెషావర్: పాకిస్తాన్లో టెర్రరిస్టు జరిపిన ఆత్మాహుతి దాడిలో 13 మంది సైనికులు చనిపోయారు. మరో 29 మందికి గాయాలయ్యాయి. శనివారం ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ ఉత్తర వజీరిస్తాన్ జిల్లాలోని ఖడ్డి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ టెర్రరిస్టు పేలుడు పదార్థాలు ఉన్న వాహనంతో సైనిక కాన్వాయ్ పైకి దూసుకొచ్చాడని అధికారులు తెలిపారు. వాహనంలో భారీ పేలుడు సంభవించడంతో 13 మంది సైనికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. మరో 29 మందికి గాయాలవ్వగా.. అందులో మహిళలు, పిల్లలు సహా19 మంది సాధారణ పౌరులు ఉన్నారని పేర్కొన్నారు.
ఈ పేలుడులో రెండు ఇండ్ల పైకప్పులు కూలిపోవడంతో అందులో ఉన్న ఆరుగురు పిల్లలు గాయపడ్డారని వివరించారు. దాడి అనంతరం ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించామని వెల్లడించారు. అనంతరం సహాయక చర్యలను ప్రారంభించామని తెలిపారు. పాకిస్తాన్‌కు చెందిన తాలిబన్ హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్‌కు చెందిన సబ్ గ్రూప్ ఉసుద్ అల్-హర్బ్ అనే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఈ దాడికి బాధ్యత వహిస్తూ ప్రకటన జారీ చేసిందని పేర్కొన్నారు. ఈ దాడిని ఇటీవల ఉత్తర వజీరిస్తాన్ లో జరిగిన అత్యంత దారుణమైన ఘటనలలో ఒకటని చెప్పారు.