రూ. 60 కోసం ఫ్రెండ్‎ని చంపిన 13 ఏళ్ల బాలుడు

రూ. 60 కోసం ఫ్రెండ్‎ని చంపిన 13 ఏళ్ల బాలుడు

యూపీ: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. కేవలం 60 రూపాయల కోసం స్నేహితుడిని చంపేశాడు 13 ఏళ్ల బాలుడు. ఈ సంఘటన హమీర్‌పూర్ జిల్లాలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమేర్‌పూర్ పట్టణానికి చెందిన బాలుడికి, అదే ప్రాంతానికి చెందిన 11 ఏళ్ల సుబ్బితో నాలుగు నెలల కిందట స్నేహం ఏర్పడింది. కొన్ని రోజుల కిందట నిందితుడైన బాలుడిని ఇంట్లోవాళ్లు కొన్ని వస్తువులు తీసుకురమ్మని 60 రూపాయలు ఇచ్చి షాపుకు పంపించారు. అయితే బాలుడు.. సుబ్బి మరియు ఇతర స్నేహితులతో కలిసి జూదం ఆడాడు. ఆ ఆటలో నిందితుడు డబ్బులు పోగొట్టుకున్నాడు. దాంతో భయపడిన నిందితుడు.. సుబ్బి దగ్గర 60 రూపాయలు అప్పుగా తీసుకొని.. వస్తువులు కొని ఇంటికి తీసుకెళ్లాడు. 

కాగా.. జన్మాష్టమి రోజున సుబ్బి.. తన డబ్బులు ఇవ్వాల్సిందిగా నిందితుడిని పదేపడే అడిగాడు. దాంతో నిందితుడు.. సుబ్బిని కాన్షి రామ్ కాలనీ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ డబ్బుల గురించి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దాంతో సుబ్బి నిందితుడిని దూషించాడు. ఆ తర్వాత రాయి తీసుకొని కొట్టడానికి నిందితుడి మీదకు వెళ్లాడు. వెంటనే తిగరబడ్డ నిందితుడు.. సుబ్బిని కిందపడేసి అదే రాయితో తిరిగి తల మీద దాడి చేశాడు. సుబ్బి తల పగిలి తీవ్ర రక్తస్రావం కావడంతో.. భయపడిన నిందితుడు.. సుబ్బిని డ్రైనేజ్ కాలువలోకి లాక్కెళ్లాడు. ఆ తర్వాత సుబ్బి బట్టల మీద పడిన రక్తపు మరకలను కడిగి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొంతసేపటికి సుబ్బి ప్రాణాలొదిలాడు. కొంత సమయం తర్వాత అటుగా వచ్చిన అడవి జంతువులు సుబ్బి మృతదేహాన్ని పీక్కుతిని 11 ముక్కలుగా చేశాయి. రెండు రోజుల తర్వాత గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారమిచ్చారు. సమాచారమందుకున్న సుమేర్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ వీరేంద్ర ప్రతాప్ సింగ్ బృందం.. సుబ్బి స్నేహితుడైన నిందితుడిని విచారించడంతో విషయం బయటపడింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. మైనర్ నిందితుడిని అదుపులోకి తీసుకొని జువైనల్ హోంకు తరలించారు.