
భోపాల్: ఆన్‌లైన్ వీడియో గేమ్‌కు అడిక్ట్ అయ్యి ఓ బాలుడు చివరికి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తల్లి
అకౌంట్‌లోని రూ.40 వేలు డబ్బులు పోవడంతో ఆమె తిట్టిందని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పుర్ జిల్లాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.
ఛతర్‌పుర్ జిల్లాలోని శాంతి నగర్‌లో ఉండే 13 ఏళ్ల బాలుడు ఫ్రీ ఫైర్ గేమ్‌కు అడిక్ట్ అయ్యాడు. ప్రో ప్లేయర్ కావాలని పెయిడ్ గేమ్స్ ఆడడం మొదలుపెట్టాడు. అందుకోసం ఆ పిల్లాడు తన తల్లి బ్యాంక్ కార్డు డీటైల్స్ ఎంటర్ చేశాడు. అలా రూ.1500 చొప్పున మనీ కట్ అవుతూ వచ్చింది. కానీ వరుసగా ఆ బాలుడు గేమ్స్ ఓడిపోవడం వల్ల డబ్బు అంతా పోయింది. సుమారు రూ.40 వేలు కోల్పోయాక అతడి తల్లి ఫోన్‌లో డబ్బులు కట్ అయిన మెసేజ్ చూసి, కొడుకును తిట్టింది. ఓ వైపు డబ్బులు పోవడంతో అప్పటికే బాధలో ఉన్న ఆ పిల్లాడు తల్లి తిట్టడంతో మనస్తాపం చెందాడు. ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎంక్వైరీలో పోలీసులు అతడి గదిలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతూ రూ.40 వేల డబ్బు కోల్పోవడం వల్ల ఆత్మహత్య చేసుకున్నట్టు అందులో రాశాడని పోలీసులు తెలిపారు. అయితే ఆ డబ్బు అతడే యాడ్ చేసి ఆడాడా లేక మరెవరి ఒత్తిడైనా ఉందా లేదంటే ఎవరైనా సైబర్ నేరగాళ్ల హస్తం ఉందా అనే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.