132 ఊళ్లు.. 3 నెలలు.. ఒక్క అమ్మాయీ పుట్టలేదు!

132 ఊళ్లు.. 3 నెలలు..  ఒక్క అమ్మాయీ పుట్టలేదు!

ఆడ పిల్లల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం ‘బేటీ బచావో బేటీ పడావో’ లాంటి పథకాలు తీసుకొస్తున్నా ఊళ్లల్లో మాత్రం పరిస్థితి ఇంకోరకంగా ఉంది. ‘ఆడ పిల్లల్ని బతికించండి.. చదివించండి’ నినాదాలకే పరిమితమవుతోంది. ఉత్తరాఖండ్‌‌‌‌ రాష్ట్రం ఉత్తర కాశీ జిల్లాలోని 132 ఊళ్లల్లో గత మూడు నెలల్లో ఒక్కరంటే ఒక్క ఆడ శిశువు కూడా పుట్టలేదు. ఆ ఊళ్లల్లో మూడు నెలల్లో 216 మంది పిల్లలు పుట్టారని, వాళ్లందరూ మగ శిశువులేనని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. దీంతో ఆ జిల్లా ఆశా వర్కర్లతో కలెక్టర్‌‌‌‌ ఆశిష్‌‌‌‌ చౌహాన్‌‌‌‌ వెంటనే సమావేశమయ్యారు. ఆ ప్రాంతాల్లో పరిస్థితిపై నిఘా పెంచాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు రిపోర్టు పంపాలన్నారు. ఆడ శిశువుల మరణాలు లేని, చాలా తక్కువగా ఉన్న ఊళ్లను గుర్తించామని కలెక్టర్‌‌‌‌ మీడియాకు తెలిపారు. ఆ ప్రాంతాల్లో అలా ఎందుకు జరుగుతోందో కారణాలు తెలుసుకుంటామని చెప్పారు. ఇందుకోసం సమగ్రంగా సర్వే చేస్తామన్నారు.

కో ఇన్సిడెన్స్‌‌‌‌ కాదు:సామాజిక కార్యకర్త కల్పన

మూడు నెలల్లో వందకు పైగా ఊళ్లలో ఒక్క ఆడ శిశువు కూడా పుట్టలేదంటే  అబార్షన్లు ఎంతలా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చని సామాజిక కార్యకర్త కల్పన ఠాకూర్‌‌‌‌ అన్నారు. ‘మూడు నెలల్లో ఒక్క ఆడ పిల్ల కూడా పుట్టలేదంటే ఇదేం కో ఇన్సిడెన్స్‌‌‌‌ కాదు. ఆ ఊళ్లల్లో ఆడ శిశువులను చంపేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం, అధికారులు ఏం చేయట్లేదు’ అని విమర్శించారు. మూడు నెలల్లో 132 ఊళ్లలో ఒక్క ఆడ శిశువు కూడా పుట్టకపోవడంపై సీనియర్‌‌‌‌ జర్నలిస్ట్‌‌‌‌ శివ్‌‌‌‌ సింగ్‌‌‌‌ తన్వాల్‌‌‌‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేంద్ర పథకం ‘బేటీ బచావో బేటీ పఢావో’ అసలు అమలవుతోందా? అని డౌట్‌‌‌‌ వస్తోందన్నారు. దీనిపై ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని
కోరారు.