22 రైళ్లు... 134 విమానాలు ఆలస్యం... ఎందుకంటే..

22 రైళ్లు... 134 విమానాలు ఆలస్యం... ఎందుకంటే..

దేశరాజధాని ఢిల్లీని పొగమంచు అల్లాడిస్తోంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో గురువారం ( డిసెంబర్​ 28)  ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది.  ఉదయం వేళలో రోడ్డు కనపడక వాహనదారులు ఇబ్బంది పడ్డారు. దట్టమైన పొగమంచు కారణంగా దేశీయ అంతర్జాతీయ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.  ఇక రైళ్లరాకపోకలపై కూడా పొగమంచు ప్రభావం చూపింది. విజిబిలిటీ కారణంగా 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని భారతీయ రైల్వే తెలిపింది. ఇందులో సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌, ప్రయాగ్‌రాజ్‌ ఎక్స్‌ప్రెస్‌ కూడా ఉన్నాయి.

 ఢిల్లీలో ఉష్ణోగ్రత కొన్ని చోట్ల 6 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. ఉదయం 5.30 గంటల సమయంలో ఉత్తరప్రదేశ్‌, హర్యానా, చండీగఢ్, రాజస్థాన్‌లో విజిబిలిటీ 25 మీటర్లు మాత్రమే ఉంది. ఢిల్లీ, పంజాబ్‌, హర్యానా, చండీగఢ్‌లలో డిసెంబర్ 31 వరకు పొగమంచు మరింత తీవ్రంగా ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. డిసెంబర్ 31 తర్వాతనే ప్రజలకు పొగమంచు నుంచి కొంత ఉపశమనం లభించవచ్చని ఐఎండీ  తెలిపింది.

ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ మరియు ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఉత్తర భారతదేశం మొత్తం చలి గాలులతో సతమతమవుతోంది. వాయువ్య ప్రాంతాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ను మరికొన్నాళ్లు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గురువారం, శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లో ఘజియాబాద్‌, అలీగఢ్‌ జిల్లాల్లో పాఠశాలల వేళలను మార్చారు. కొన్ని చోట్ల అయితే సెలవులు కూడా ప్రకటించారు. బుధవారం పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లో తొలిసారి అత్యల్పంగా 2 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది.