బోయినపల్లి అభిషేక్​కు 14 రోజులు రిమాండ్

బోయినపల్లి అభిషేక్​కు 14 రోజులు రిమాండ్
  • నిందితులను సీబీఐ స్పెషల్ కోర్టు ముందు హాజరుపరిచిన ఈడీ
  • ఈడీ విజ్ఞప్తితో నాయర్​కు 2 రోజుల కస్టడీ పొడిగింపు
  • చలికాలం దుస్తులు, పుస్తకాలకు కోర్టు ఓకే
  • నిందితులను సీబీఐ స్పెషల్ కోర్టులో హాజరుపరిచిన ఈడీ

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బోయినపల్లి అభిషేక్​కు సీబీఐ స్పెషల్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అయితే, చలికాలం వేసుకునే దస్తులు, పుస్తకాలు, అవసరమైన మెడిసిన్ అందించాలని జైలు అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. విజయ్ నాయర్​కు మరో 2 రోజులు ఈడీ కస్టడీని పొడిగించింది. లిక్కర్ స్కాంలో సీబీఐ కేసుకు సంబంధించి ఈ నెల 14న అభిషేక్, విజయ్ నాయర్​కు సీబీఐ స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ, వెంటనే 5 రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. తర్వాత ఈడీ విజ్ఞప్తి మేరకు కస్టడీని మరో 5 రోజులు పొడిగించింది. మొత్తం 10  రోజుల కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు గురువారం అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్​ను సీబీఐ స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జ్ నాగ్​పాల్ అభిషేక్​కు డిసెంబర్ 8 వరకు రిమాండ్ విధించారు. ఈ కేసులో విజయ్ నాయర్​ను ఇంకా ప్రశ్నించాల్సి ఉందని, మరో ఐదు రోజుల కస్టడీ అప్పగించాలని ఈడీ తరఫు న్యాయవాది నవీన్ కుమార్ మిట్ట బెంచ్​ను కోరారు. విజయ్ నాయర్ లాప్ ట్యాప్ ఫోరెన్సిక్ ల్యాబ్​కు పంపించినట్లు తెలిపారు. ల్యాప్ డాటా రికవరీ జరుగుతుందని, లిక్కర్ స్కామ్​లో విజయ్ నాయర్ ల్యాప్​టాప్​​ రిపోర్ట్ చాలా కీలకమని వివరించారు. ఫోరెన్సీ ల్యాబ్ నుంచి ల్యాప్​టాప్ రిపోర్టు రేపు రానుందని బెంచ్ కు తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో రూ.100 కోట్లు చేతులు మారాయని, వీటికి సంబంధించిన వివరాలు రాబట్టాల్సి ఉందన్నారు. ఈడీ విచారణకు విజయ్ నాయర్ సహకరిస్తున్నారని ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇప్పటికే నాయర్ అన్ని వివరాలు ఈడీకి చెప్పారన్నారు. మెయిల్ వివరాలు, ల్యాప్ టాప్ పాస్ వర్డ్ కూడా ఇచ్చారన్నారు. ఈడీ కస్టడీలో రెండు మూడు రోజులు అసలు ప్రశ్నించలేదని బెంచ్ దృష్టికి తీసుకొచ్చారు. డాటా అనాలసిస్ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ఇప్పటికే10 రోజుల కస్టడీ ముగిసినా ఇంకా ఈడీ విచారణ పేరుతో కస్టడీ కోరుతోందన్నారు. ఇరువైపుల వాదనలు విన్న జడ్జ్ నాగ్ పాల్.. మరో 2 రోజులు విజయ్ నాయర్ కు ఈడీ కస్టడీ విధించారు. అభిషేక్ ను మాత్రం తిహార్ జైల్ కు తరలించారు.

శరత్, బినోయ్​కు హోం ఫుడ్​కు నో

లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైలులో ఉన్న తెలంగాణకు చెందిన శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబులకు హోంఫుడ్ అందించేందుకు సీబీఐ స్పెషల్ కోర్టు నిరాకరించింది. సెలెక్టెడ్ బుక్స్​ను మాత్రం అందించాలని జైలు అధికారులను ఆదేశించింది. హోం ఫుడ్ అందించాలని శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబులు వేసిన పిటిషన్​ను గురువారం రౌస్ ఎవెన్యూలోని సీబీఐ స్పెషల్ కోర్టు విచారించింది. జడ్జి నాగ్​పాల్ స్పందిస్తూ.. జైలు రూల్స్ ప్రకారం హోంఫుడ్ అనుమతించడం కుదరదని స్పష్టం చేశారు. డాక్టర్లు సూచిస్తే జైలు రూల్స్​ ప్రకారం అక్కడే తయారు చేయించుకోవచ్చని చెప్పింది. సెలెక్టెడ్ పుస్తకాలు కావాలని అడ్వకేట్లు కోరగా.. కోర్టు అంగీకారం తెలిపింది. ఈనెల 21తో 10 రోజుల ఈడీ కస్టడీ ముగియడంతో శరత్, బినోయ్​కు సీబీఐ స్పెషల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిందితులకు వింటర్ క్లాత్స్, వాటర్ ఫ్లాస్క్, బూట్లు, రెండు జతల బట్టలు, అవసరమైన మెడిసిన్ వాడేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.

బోయినపల్లి అభిషేక్, విజయ్ నాయర్​కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బోయినపల్లి అభిషేక్ రావు, ఆప్ కమ్యూనికేషన్ ఇన్​చార్జ్ విజయ్ నాయర్​కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై రిప్లే ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 14న నిందితులకు సీబీఐ స్పెషల్ కోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ ను జస్టిస్ యోగేశ్ ఖన్నా సింగిల్ జడ్జి బెంచ్ ​గురువారం విచారించింది. సీబీఐ స్పెషల్ కోర్టు ముందు శుక్రవారం చార్జ్ షీట్ దాఖలు చేయనున్నట్లు సీబీఐ అధికారులు బెంచ్​కు తెలిపారు. బెయిల్‌పై సుప్రీం ఇచ్చిన ఏడు అంశాలను ఈ కేసులో పాటించలేదని బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. లిక్కర్ పాలసీపై ఏదైనా విచారణ జరిగితే అసలు నిందితులు దొరకకూడదనే ఉద్దేశంతో వ్యవహరించారని వివరించారు. లిక్కర్ పాలసీ–2021లో మార్పులు చేసేలా ప్రైవేటు లిక్కర్ హోల్ సేలర్ల నుంచి డబ్బులు సమీకరించిట్లు గుర్తించినట్లు వివరించారు. ఈ టైమ్‌లో ప్రతివాదిని బెయిల్​పై విడుదల చేస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందన్నారు. సీబీఐ తరఫు వాదనలు విన్న బెంచ్​.. ప్రస్తుతం వాళ్లు రిమాండ్​లో ఉన్నందున సీబీఐ స్పెషల్ కోర్టు ఇచ్చిన బెయిల్​ను రద్దు చేయలేమంది. సీబీఐ లేవనెత్తిన అభ్యంతరాలపై నోటీసులిస్తూ.. వాటికి రిప్లే ఇవ్వాలని కోరింది. విచారణను డిసెంబర్ 5కు వాయిదా వేసింది. కాగా, లిక్కర్ స్కాంలో సీబీఐ దాఖలు చేసిన కేసులో నిందితులకు సీబీఐ స్పెషల్ కోర్టు ఈ నెల 14న బెయిల్ ఇచ్చింది. వెంటనే ఈసీ కస్టడీకి అప్పగించింది. గురువారంతో కోర్టు ఇచ్చిన 10 రోజుల కస్టడీ ముగియడంతో అభిషేక్, విజయ్​​ను సీబీఐ స్పెషల్ కోర్టు ముందు హాజరుపరిచారు.