ఘోర కారు ప్రమాదం.. 14 మంది మృతి

ఘోర కారు ప్రమాదం.. 14 మంది మృతి

మెక్సికోలోని జాలిస్కో రాష్ట్రంలో హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. హైవేపై నిలిపి ఉంచిన ట్రక్కును కారు ఢీకొని మంటలు చెలరేగడంతో 14 మంది మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురు ప్రయాణికులు మరియు ఒక చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని హుటాహుటిన ఎయిర్ అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో బాధితుల మృతదేహాలలో కొన్ని పూర్తిగా కాలిపోయాయి.

చెక్కలతో లోడ్ చేయబడిన ట్రక్కు హైవేపై నిలిపి ఉంచింది. ఆ రహదారిలో వెళ్తున్న నిస్సాన్ ఉర్వాన్ వ్యాన్ వేగంగా వచ్చి ట్రక్కుపైకి దూసుకెళ్లినట్లు జాలిస్కో పోలీసులు తెలిపారు. కారు వేగంగా ట్రక్కును ఢీకొట్టడంతో మంటలు చెలరేగి, అందులోని ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ నిపుణులు కాలిపోయిన కారు నుంచి మృతదేహాలను వెలికితీసి ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాదం జరగడంతో పోలీసులు హైవేను మూసివేశారు.