
ముంబై: ఓ రేపిస్ట్ బారినుంచి తన 6 ఏళ్ల చెల్లిని 14 ఏళ్ల అన్న కాపాడాడు. ఈ ఘటన ముంబైలోని జుహు ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా నివసించే దంపతులు తమ పాప, బాబును ఇంట్లో వదిలి పనిమీద బయటకు వెళ్లారు. పిల్లలు ఇంట్లో టీవీ చూస్తుండగా.. కేబుల్ కనెక్షన్ సమస్య వచ్చింది. దాంతో తమ తల్లిదండ్రులతో కలివిడిగా ఉండే పక్కంటివారి సాయం కోసం పాప వెళ్లింది. పాపను చూసిన 45 ఏళ్ల పక్కింటి వ్యక్తి.. పాపను గదిలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. దాంతో భయపడిన బాలిక గట్టిగా కేకలు వేసింది. బాలిక అరుపులు విన్న ఆమె అన్న వెంటనే అక్కడికి వెళ్లి తలుపులు బాది.. చెల్లిని బయటకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత జరిగిన సంఘటన గురించి పిల్లలు తమ తల్లిదండ్రులకు తెలియజేశారు. దాంతో తల్లిదండ్రలు జుహు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించగా.. పోలీసు ఇన్స్పెక్టర్ దత్తాత్రేయ మస్వేకర్ నేతృత్వంలోని పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేశారు. తన సోదరిని కాపాడటానికి 14 ఏళ్ల బాలుడు చేసిన పనిని జుహు పోలీస్ స్టేషన్ అధికారులు ప్రశంసించారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 354 మరియు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.