ఇండస్ట్రియల్ ఏరియాలోని 140 సీసీ కెమెరాల్లో ఒక్కటీ పనిచేయట్లే

ఇండస్ట్రియల్ ఏరియాలోని 140 సీసీ కెమెరాల్లో ఒక్కటీ పనిచేయట్లే

జీడిమెట్ల, వెలుగు : ఇండస్ట్రియల్ ఏరియాలో సరైన నిఘా వ్యవస్థ లేకపోవడంతోనే కెమికల్ డంపింగ్ మాఫియా రెచ్చిపోతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. కంపెనీల్లోని వేస్టేజ్​ను శుద్ధి కేంద్రాలకు తరలించకుండా అర్ధరాత్రి  నాలాలు, ఖాళీ ప్రదేశాలు, రోడ్లపై పారబోస్తుండటంతో స్థానిక జనం ఇబ్బంది పడుతున్నారు. కొన్ని ఫార్మా కంపెనీలు ఈ డంపింగ్​ మాఫియాను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. గత నెలలో పీసీబీ అధికారులపైనే డంపింగ్ మాఫియా దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రియల్ ఏరియాలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, నాలాల వద్ద  సెక్యూరిటీ గార్డులు లేకపోవడం, ఎస్టేట్ చుట్టూ ఏర్పాటు చేసిన గేట్లు విరిగి మూలకు పడటం.. ఇలా సెక్యూరిటీ నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం డంపింగ్ మాఫియా పనులకు అనుకూలంగా మారుతోంది. 

ట్యాంకర్ల తనిఖీలు సైతం ఆగినయ్..

డంపింగ్​ను అడ్డుకునేందుకు గతంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ చుట్టూ అధికారులు గేట్లు ఏర్పాటు చేశారు. రాత్రివేళ​లో కేవలం కొన్ని గేట్లు మాత్రమే ఓపెన్ చేసి అక్కడ సెక్యూరిటీ గార్డులను ఉంచేవారు. దీంతో రాత్రిపూట రాకపోకలు సాగించే ట్యాంకర్లను సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేసేవారు.  కొంతకాలంగా ఈ గేట్ల నిర్వహణను సైతం అధికారులు పట్టించుకోకపోవడంతో అవి విరిగిపోయాయి. దీంతో ఆ రూట్లలో ట్యాంకర్లు తీసుకెళ్తూ  కెమికల్​ను ఎక్కడపడితే అక్కడ డంప్ చేస్తున్నారు. ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ నుంచి ప్రవహించే నాలాల వద్ద పీసీబీ ఆధ్వర్యంలో సెక్యూరిటీ గార్డులను నియమించారు. దీంతో నాలాల వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ట్యాంకర్లను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని ప్రశ్నించేవారు. నాలాలో నీళ్లు రంగు మారితే గుర్తించి పీసీబీ అధికారులకు సమాచారం ఇచ్చేవారు. ప్రస్తుతం ఈ సెక్యూరిటీ గార్డుల వ్యవస్థను సైతం అధికారులు తొలగించారు. నాలాల దగ్గర ఒక్క సెక్యూరిటీ గార్డు కూడా కనిపించడం లేదు. ఇండస్ట్రియల్ ఏరియాలో నిఘా వ్యవస్థ లేకపోవడంతో ఇతర జిల్లాల నుంచి తీసుకొచ్చిన కెమికల్​ వేస్టేజ్​ను సైతం ఇక్కడే పారబోస్తున్నట్లు ఆరోపణలున్నాయి. వీటిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 

కోటి రూపాయలతో  సీసీ కెమెరాలు

ఇండస్ట్రియల్ ఏరియాలో కెమికల్ డంపింగ్​ను అడ్డుకునేందుకు టీఎస్ఐఐసీ-ఐలా(ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ) అధికారులు గతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మూడేండ్ల కిందట జీడిమెట్ల  ఎస్వీ కో ఆపరేటివ్ ​సోసైటీ, కూకట్​పల్లి, గాంధీనగర్, బాలానగర్ ఎస్వీ కో ఆపరేటివ్​ సోసైటీ మొత్తం 5 ఇండస్ట్రియల్ ఎస్టేట్స్​లో సుమారు రూ.కోటి ఖర్చుతో 140 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీంతో సుమారు 2 వేల కంపెనీలు సీసీ కెమెరాల నిఘాలోకి వచ్చాయి. దీంతో ఆ టైమ్​లో డంపింగ్​కు బ్రేకులు పడ్డాయి. కానీ మెయింటెనెన్స్ లేకపోవడంతో ఏడాది తర్వాత నుంచి సీసీ కెమెరాలు పనిచేయడం మానేశాయి.  దీంతో మళ్లీ ఇష్టమొచ్చిన చోట కెమికల్ డంపింగ్ మొదలైనట్లు స్థానికులు చెబుతున్నారు.