
ముసద్దీలాల్ జువెలర్స్ కు చెందిన రూ.82.11 కోట్ల విలువైన 145.89 కిలోల బంగారాన్ని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్ , విజయవాడలోని ముసద్దీలాల్ తోపాటు దాని భాగస్వామ్య సంస్థలు, వాటి యజమానుల ఇళల్లో కొద్దిరోజులుగా సోదాలు జరిపి ఈ బంగారాన్ని పట్టుకున్నట్టు గురువారం తెలిపింది.
పెద్దనోట్ల రద్దు సమయంలో కొద్ది గంటల వ్యవధిలోనే ముసద్దీలాల్ జువెలర్స్ రూ.110.85కోట్ల సొమ్మును బ్యాంక్ లో జమచేసింది. 5వేల 2వందల మంది కస్టమర్లు తమ వద్ద బంగారాన్ని కొన్నారంటూ వారి పేరుతో బోగస్ ఇన్ వాయిస్ లు సృష్టించింది. పాన్ నంబర్ అవసరం లేకుండా ఉండేందుకు వారంతా తమ షాపుల్లో రూ.2 లక్షల కంటే తక్కువ బంగారం కొన్నట్టు వివరించింది. ఈ వ్యవహారంపై ఈడీ దృష్టి సారించడంతో అసలు బాగోతం బయటపడింది.
ముసద్దీలాల్ దుకాణంలోని సీసీ ఫుటేజీని పరిశీలించగా ఆ టైంలో అంత మంది బంగారం కొనుగోలు చేయలేదని తేలింది. దీంతో అప్పట్లోనే మనీ లాండరింగ్ ప్రివెన్షన్ యాక్ట్ కింద ముసద్దీలాల్ యజమాని కైలాస్ గుప్తా, ఆయన కొడుకులపై కేసులు నమోదయ్యాయి. కేసు దర్యాప్తులో భాగంగా తాజాగా హైదరాబాద్, విజయవాడలోని ముసద్దీలాల్ జువెలరీ షాపులు, బాలాజీ గోల్డ్, అష్టలక్ష్మి గోల్డ్ సంస్థలతో సంజయ్ సర్దా అనే చార్టర్ అకౌంటెంట్ ఇళ్లపై దాడులు చేసి పెద్ద ఎత్తున బంగారం స్వాధీనం చేసుకుంది ఈడీ.