- వచ్చే ఏడాది నుంచి అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తం: రేవంత్రెడ్డి
హైదరాబాద్ , వెలుగు: కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించి, వచ్చే ఏడాది నుంచి అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ ఉత్సవానికి జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చేలా జాతీయ పండుగగా గుర్తించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాస్తామని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవంలో శనివారం సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు.
‘‘14 ఏండ్లుగా నిర్వహిస్తున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అభినందనీయం. హైదరాబాద్‌లో మొదలై దేశ సరిహద్దులు దాటి భక్త కోటికి మహాదేవ నామాన్ని వినిపిస్తున్న ఈ ఉత్సవం రాష్ట్ర ప్రజలకు గర్వకారణం. ఆధ్యాత్మికత మనందరికీ శక్తిని, స్ఫూర్తిని ఇస్తుంది. నా పుట్టినరోజును ఇలా కోటి దీపోత్సవంలో గడపడం జీవితకాల జ్ఞాపకంగా మిగులుతుంది” అని తెలిపారు. తెలంగాణను దేశంలోనే నంబర్ వన్‌గా నిలపడానికి ప్రజల సహకారం ఉండాలని కోరుకుంటూ, పరమేశ్వరుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని సీఎం రేవంత్రెడ్డి ఆకాంక్షించారు.
