- ఇన్నాళ్లూ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్‌ను చూపించి కంప్లీషన్ సర్టిఫికెట్ అంటూ డ్రామా
- రిపేర్ల నుంచి తప్పించుకుంటూ వచ్చిన సంస్థ
- 5 సార్లు నోటీసులిచ్చినా తమకేం సంబంధం లేదంటూ వాదనలు
- కంపెనీకి రామగుండం ఎస్ఈ ఇటీవల రాసిన లేఖలో స్పష్టీకరణ
- ఎల్ అండ్ టీ చేసిన పనికి డిపార్ట్‌మెంట్
- తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ వ్యాఖ్య
- కొత్త పనులంటూ అంచనా వ్యయం
- రూ.2,591 కోట్ల నుంచి 4,613 కోట్లకు పెంపు
- అయినా ఆ అదనపు పనులనూ పూర్తి చేయని సంస్థ
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీ విషయంలో నిర్మాణ సంస్థ ఎల్అండ్‌టీ అడుగడుగునా నిర్లక్ష్యం ప్రదర్శించిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వంలోని కొందరు పెద్దలు, మరికొందరు అధికారుల అండ చూసుకుని.. ఆ సంస్థ కనీసం నిర్మాణ లోపాలనూ సరిదిద్దలేదని స్పష్టమవుతున్నది. అంతేకాదు.. పనులు పూర్తి చేయకున్నా కంప్లీషన్ సర్టిఫికెట్ కోసం ఒత్తిడి తీసుకొచ్చినట్టు ఇప్పటికే జ్యుడీషియల్ కమిషన్ ఎంక్వైరీలో అధికారులు తేల్చి చెప్పారు.
ఇప్పుడా కంప్లీషన్ సర్టిఫికెట్‌పై మరో వాదన తెరపైకి వచ్చింది. అసలు ఆనాడు సంస్థకు ఇచ్చింది కంప్లీషన్సర్టిఫికెట్ కాదని, అది ఎక్స్పీరియన్స్సర్టిఫికెట్అని అధికారులు తేల్చి చెబుతున్నారు. మేడిగడ్డ బ్యారేజీ రిపేర్లు చేయాలని ఇటీవల ఎల్‌అండ్‌టీ సంస్థకు రామగుండం ఎస్‌ఈ రాసిన లేఖలోనే ఈ విషయం తేటతెల్లమైంది. ఇన్నాళ్లూ ఆ ఎక్స్పీరియన్స్సర్టిఫికెట్ను అడ్డంపెట్టుకుని కంప్లీషన్సర్టిఫికెట్ అంటూ.. ఎల్‌అండ్‌టీ సంస్థ తాను చేయాల్సిన రిపేర్ల పనులనూ తప్పించుకుంటూ వస్తున్నది. ఐదుసార్లు ఇరిగేషన్‌శాఖ అధికారులు నోటీసులిచ్చినా తనకేం సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించింది.
లేఖలో ఏముందంటే..
మేడిగడ్డ బ్యారేజీ రిపేర్లు చేయాలని ఇటీవల ఎల్‌అండ్‌టీ సంస్థకు రామగుండం ఎస్‌ఈ లేఖ రాశారు. ‘‘మేడిగడ్డ బ్యారేజీని నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ పూర్తి చేయలేదు. బ్యాలెన్స్వర్క్స్, అదనపు పనులను పూర్తి చేసే ప్రయత్నమూ చేయలేదు. ఇరిగేషన్‌శాఖ నుంచి ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదు. ఒప్పందం ప్రకారం పనులు పూర్తి చేయాల్సిన సంస్థ.. కంప్లీషన్సర్టిఫికెట్ను అడ్డంపెట్టుకుని తప్పించుకుంటూ వచ్చింది.
కానీ అది కంప్లీషన్ సర్టిఫికెట్కాదు.. కేవలం ఎక్స్పీరియన్స్సర్టిఫికెట్. సంస్థ చెప్పుకుంటున్న ఆ కంప్లీషన్సర్టిఫికెట్ను ప్రభుత్వం రద్దు చేయడం సరైన నిర్ణయమే. బ్యారేజీలో ఎన్నో లోపాలు ఉన్నాయి. వాటిని సరిచేయకుండా, మిగిలిపోయిన పనులను పూర్తి చేయకుండా పెండింగ్‌లో పెట్టి నిబంధనలకు విరుద్ధంగా ఆ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్‌ను తీసుకున్నది’’ అని లేఖలో స్పష్టం చేశారు.
ప్రారంభంలోనే డ్యామేజ్..
మేడిగడ్డ బ్యారేజీని 2019 జూన్‌లో ప్రారంభించారు. కానీ అదే ఏడాది నవంబర్, 2020 ఫిబ్రవరి, 2020 మే నెలల్లో బ్యారేజీకి డ్యామేజ్‌లు జరిగినట్టు అధికారులు గుర్తించారు. వాటికి రిపేర్లు చేయాలని 2020 మేలోనే ఎల్‌అండ్‌టీకి లేఖ రాసినా.. ఆ సంస్థ స్పందించలేదు. ఈ విషయాన్నీ లేఖలో ఎస్ఈ ప్రస్తావించారు. అంతేకాదు.. సీసీ బ్లాకులు, వేరింగ్ కోట్వంటి వాటికి రిపేర్లు చేయాలని పలుమార్లు నోటీసులిచ్చినా సంస్థ పెడచెవిన పెట్టిందన్నారు. ఆ డ్యామేజ్‌లకు రిపేర్లు చేసే బాధ్యత తమది కాదంటూ రిప్లై ఇచ్చిందని పేర్కొన్నారు. మిగిలిపోయిన పనులైన అప్రోచ్‌రోడ్లు, గ్యాంట్రీక్రేన్లకు మెయింటెనెన్స్ బేలు, బ్యారేజీ ఎడమవైపున డైవర్షన్చానెల్, త్రీడీ మోడల్స్టడీస్ వంటి పనులు చేయాల్సి ఉన్నా చేయలేదు.
దానికి సంబంధించి 2021 జనవరి, ఫిబ్రవరిలో రెండుసార్లు ఆ సంస్థకు ఆ పనులు పూర్తి చేయాలని చెప్పినా చేయలేదు. 2022 ఏప్రిల్‌లో మరోసారి ఈ విషయాలపై అధికారులు లేఖ రాసినా పట్టించుకోలేదు. 2023 ఏప్రిల్27న అధికారులు రివ్యూ చేసి మేడిగడ్డ నుంచి పంపింగ్ ఆపేశారు. తర్వాత మూడు రోజులకు బ్యారేజీలోని నీటిని దిగువకు వదిలేసి ఖాళీ చేశారు. తర్వాత రిపేర్లు, పెండింగ్‌పనులు పూర్తి చేయాలని సంస్థకు చెప్పినా పెడచెవిన పెట్టింది. ఆయా అంశాలన్నింటినీ లేఖలో పొందుపరిచిన రామగుండం ఎస్‌ఈ.. డిజైన్ల సమస్యతోనే బ్యారేజీకి నష్టం జరిగిందని, దానికి రిపేర్లు చేయాలని స్పష్టం చేశారు. తమకు సంబంధం లేదని రిప్లై ఇచ్చిన ఎల్‌అండ్‌టీ.. అగ్రిమెంట్ రూల్స్‌ను ఉల్లంఘించింది.
కొత్త పనులంటూ అంచనాలు పెంచి..
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి తొలుత అంచనా వ్యయాన్ని రూ.2,591 కోట్లుగా 2016 మార్చిలో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. జీవోనూ జారీ చేసింది. కానీ 2018 మేలో ఫ్లడ్‌బ్యాంక్స్, డైవర్షన్చానెల్స్, అప్రోచ్‌రోడ్, తాత్కాలిక సీఆర్పీఎఫ్క్యాంప్నిర్మాణం, గ్రౌండ్ఇంప్రూవ్మెంట్వంటి అదనపు పనులను చూపించి అంచనాలను రూ.3,260 కోట్లకు పెంచారు. మరోసారి 2022 మేలో రెండోసారి అంచనాలను రూ.4,613 కోట్లకు పెంచారు.
కొత్త పనులని చెప్పి అంచనాలను పెంచినా.. పాత పనుల వరకే నిర్మాణ సంస్థ పరిమితమైంది. అంచనాల్లో పేర్కొన్న అదనపు పనులు గానీ, డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్‌లో దెబ్బతిన్న వాటికి రిపేర్లుగానీ సంస్థ చేయలేదు. అధికారులు లేఖలు రాసినప్పటికీ ఆ సంస్థ పెడచెవిన పెట్టింది. గత ప్రభుత్వం కూడా సంస్థకే వంతపాడిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగానే ఆ సంస్థ పట్టించుకోకపోవడంతో బ్యారేజీకి తీరని నష్టం జరిగిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
